దుగ్గిరాల: దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధమైన రైతుల సమావేశం నిర్వహించారు. మంగళవారం దుగ్గిరాలలోని పసుపు యార్డులో ములకా సాంబిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో పసుపు రైతుల రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర సంత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజీలో దగ్ధమైన పసుపునకు పరిహారం అందించడంలో రైతులను ముప్పతిప్పలు పెడుతోందన్నారు. పెద్దల కమిటీలో బహిరంగంగా రైతులకు క్వింటాకు రూ.7 వేలు ఇస్తామని హామీ ఇచ్చి నేడు పరిహారం కుదించి రూ.5 వేలు ఇస్తామని చెప్పడంతో రైతులు ఉద్యమ బాటలో నడవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ములకా సాంబిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని ఆశ పడ్డ రైతులకు నిరాశే మిగిలిందన్నారు. రైతులు ఆందోళనకు సిద్ధంగా ఉన్నారని, ఈ నెల 20 లోపు న్యాయం జరగకపోతే వ్యవసాయ మంత్రి క్యాంపు కార్యాలయానికి రాయబారానికి వెళ్లాలని సమావేశంలో తీర్మానించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు లాయర్లు కె.వీరయ్య, వై.శ్రీనివాసరావు, రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.అజయ్, కమిటీ సభ్యులు బి.శ్రీనివాసరావు, వ్యవసాయం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు, రైతులు రవి కిషోర్, వెంకటప్ప రెడ్డి, నాగేశ్వర రెడ్డి, సత్యనారాయణ, సురేంద్ర, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.


