సెక్యూరిటీ అలారం మోగడంతో పరారీ
మంగళగిరి టౌన్: మెడికల్ షాపులో చోరీకి వచ్చి అలారమ్ మోగడంతో వారు పరారీ అయిన ఘటన మంగళవారం తెల్లవారుజామున మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్ సమీపంలో గౌతమబుద్ధ రోడ్డు వెంబడి శ్రీ ధాత్రి సాయి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్‌ను పట్టణానికి చెందిన ఫణీంద్ర అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తన ఫోన్‌లో అలారం మోగడంతో వెంటనే షాపు సీసీ కెమెరాలను తన ఫోన్‌లో చూశాడు. అదే సమయంలో అలారం ఏర్పాటు చేసిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ వారు కూడా ఫణీంద్రకు ఫోన్‌లో సమాచారం అందించారు. అయితే సీసీ కెమెరాల్లో ఏమీ కనబడకపోవడంతో నిద్రపోయాడు. వెంటనే మరుక్షణంలోనే అలారం మోగడంతో తన ఫోన్‌లో సీసీ కెమెరా ఓపెన్ చేయగా షట్టర్ పగలకొట్టి లోపలకు ఓ వ్యక్తి ప్రవేశించడం గమనించాడు. వెంటనే తన ఫోన్‌లో అలారం బటన్ నొక్కి తన షాపులో మోగే విధంగా ఏర్పాటు చేశాడు. దీంతో దుండగుడు వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంటి వద్ద నుంచి షాపు వద్దకు వచ్చి చూడగా షట్టర్ తాళాలు పగలకొట్టి, పైన ఉన్న సీసీ కెమెరా పక్కకు వంచి ఉండడం, సైరన్ బాక్స్ పగలకొట్టి ఉండడం గమనించాడు. వెంటనే పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాడు. అయితే పోలీసులు సరిగా స్పందించలేదని బాధితుడు తెలిపాడు. షాపులో ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు.
గతంలో ఇదే తరహాలో....
మూడేళ్ల క్రితం 2023 జూలై నెలలో ఇదే తరహాలో షాపు పైభాగంలో రంద్రం చేసి దుండగుడు లోపలకు ప్రవేశించాడని, షాపులో వున్న అధిక మొత్తంలో నగదును, హార్డ్‌డిస్క్ అపహరించుకుపోయినట్లు బాధితుడు ఫణీంద్ర తెలిపాడు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీస్ అధికారులు, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించి విచారించారని, కానీ నేటికీ ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, అందువల్లే ఇప్పుడు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించినట్లు పేర్కొన్నాడు.
లోయలో పడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలింపు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎగువ సన్నిధి కొండపై వున్న గండాలయ స్వామిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్‌లో ద్విచక్రవాహనాల ద్వారా భక్తులు ప్రయాణాలు చేస్తారు. అమావాస్య కావడంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి కొండపైకి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఘాట్‌రోడ్‌లో వస్తుండగా రెండు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాయి. వాటిపై ఉన్న ఇద్దరు యువకులు లోయలోకి జారుకున్నారు. గమనించిన పలువురు భక్తులు వారిని పైకి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద భరితంగా ఉన్న ఘాట్‌రోడ్‌లో ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు, సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్సకోసం స్థానిక దేవస్థానం సిబ్బందిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా
గుంటూరు ఎడ్యుకేషన్: కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక విద్యాబోధన నైపుణ్యాలు అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా అన్నారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మంగళవారం డివిజన్ స్థాయిలో వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమంతో పాటు డీఆర్పీలకు జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని పట్టాభిపురం, వేణుగోపాల్‌నగర్‌లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించారు. ఈసందర్భంగా డీఈఓ సలీమ్ బాషా మాట్లాడుతూ మారిన సిలబస్, లీప్ యాప్, తదితర అంశాలపై శిక్షణలో నేర్చుకున్న అంశాలను డివిజన్ స్థాయిలో శిక్షణ కల్పించాలని సూచించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో తరగతి గదిలో విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే విధంగా బోధించి, పాఠశాలలను అభివృద్ధి బాట పట్టించాలన్నారు. కోర్సు కో–ఆర్డినేటర్ కె.విజయభాస్కర్ మాట్లాడుతూ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ రెండు రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో స్టేట్ రీసోర్స్ పర్సన్, డైట్ అధ్యా పకులు, డీఆర్పీలు పాల్గొన్నారు.
దాచేపల్లి: గూడ్స్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రాత్రి రాత్రి 8:30 గంటల సమయంలో పొందుగల–నడికుడి రైల్వేస్టేషన్ల మధ్య ఓ మహిళ నడుచుకుంటూ వెళుతోంది. గమనించిన గూడ్స్‌రైలు లోకో పైలట్ పలు మార్లు గట్టిగా హారన్ మోగించినప్పటికి సదరు మహిళ పట్టాలపై నుంచి పక్కకు తప్పుకోలేదు. దీంతో గూడ్స్‌రైలు కిందపడి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి శరీరంపై పింక్ కలర్ పూల డిజైన్‌చీర, నలుపు రంగు జాకెట్ ఉన్నది. నడికుడి రైల్వే పోలీస్‌లు మృతదేహాన్ని పరిశీలన చేసి కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


