ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Jun 9 2026 4:48 AM | Updated on Jun 9 2026 4:48 AM

ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి ఆలోచింపజేసిన సందేశాత్మక నాటికలు

రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌

పెదకాకాని: రైతులు ఏపీ ఏఐఎంఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌ అన్నారు. పెదకాకాని మండలంలోని నంబూరు మన గ్రోమోర్‌, వెనిగండ్ల దనీత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎరువులు, పురుగుమందులు షాపుల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌ మాట్లాడుతూ రైతులకు సౌకర్యవంతంగా ఏపీ ఏఐఎంఎస్‌(వ్యవసాయ సమాచార నిర్వహణ విధానం) యాప్‌ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ యాప్‌ ద్వారానే రైతులకు యూరియా, డీఏపీ విక్రయాలు జరుగుతాయని వెల్లడించారు. పంటలు సాగు చేసే రైతులు తమ పంట నమోదు చేసుకోవడం ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను దారి మళ్లించకుండా ఉండేందుకు ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. ఈ ఏడాది రైతుల అవసరాల మేరకు ఎరువుల లభ్యత ఉంటుందని చెప్పారు. రైతులు తమకు ఇష్టమైన ప్రాంతంలోని డీలర్ల ఎరువులు తీసుకునే వెసులుబాటు ఈ యాప్‌ ద్వారా ఉంటుందని తెలిపారు. వర్షం పడితే పొలాలకు ఎరువులు చేరడం ఇబ్బందిగా ఉంటుందని ముందుగానే ఎరువులు ఇవ్వాలని పలువురు రైతులు కమిషనర్‌ దృష్టికి తీసుకు రావడంతో సానుకూలంగా స్పందించారు. ఈ యాప్‌ ద్వారా ఆరుగురు రైతులకు 15 బస్తాలు యూరియా ఇచ్చారు. కార్యక్రమంలో కమిషనర్‌ కార్యాలయం ఎస్‌ఈఐటీ సెల్‌ బాల సుబ్రహ్మణ్యం, ఏడీఏ ఫర్టిలైజర్స్‌ రాజన్‌, డీడీ ఫర్టిలైజర్‌ ఎం.ఆనంద్‌రావు, వ్యాసర్‌ ల్యాబ్‌ హరి, మండల వ్యవసాయ అధికారి రమణకుమార్‌ పాల్గొన్నారు. అనంతరం ఆత్మ పీడీ ఎ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేత్‌ బాచావో అభియాన్‌ కార్యక్రమం పెదకాకాని సచివాలయంలో నిర్వహించారు. ఏడీఏ ఎన్‌ రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.

తెనాలి: డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన సోమవారం కొనసాగాయి. తొలి ప్రదర్శనగా ఆరభి యూత్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌, రాప్తాడు వారి ‘డొక్కా సీతమ్మ’ నాటికను ప్రదర్శించారు. ఆముదాల సుబ్రమణ్యం రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మగా భావిక, పెద్ద సీతమ్మగా యశోదమ్మ, ఇతర పాత్రల్లో బాషా, అరుణ్‌బాబు తదితర 30 మందికి పైగా నటీనటులు నటించారు. తదుపరి గర్తపురి థియేటర్‌ ఆర్ట్స్‌, గుంటూరు వారి ‘5జీ కపుల్స్‌’ నాటికను ప్రదర్శించారు. ఎస్‌కేడీ హస్సన్‌ రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. చివరగా ఎన్‌ఎంఆర్‌ క్రియేషన్స్‌, అనకాపల్లి వారి ‘వేదాంతం’ నాటికను ప్రదర్శించారు. ప్రఖ్యాత సాహితీవేత్త గుడిపాటి వెంకటాచలం మూలకథకు మార్గశీర్ష నాటకీకరించగా, ముత్యాలరావు పొన్నాడ దర్శకత్వం వహించారు. తొలినాటిక ప్రఖ్యాత సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మ జీవితానికి సంబంధించినది కాగా, ఇతర నాటికలు సందేశాత్మక ఇతివృత్తంతో సాగాయి. ప్రఖ్య చిల్డ్రన్‌ ఆర్ట్స్‌ థియేటర్‌, తెనాలి కళాకారుల సంఘం–తెనాలి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలను పరిషత్‌ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణరావు, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement