ఛాన్స్‌ చూసి ఏసీయ్‌..! | - | Sakshi
Sakshi News home page

ఛాన్స్‌ చూసి ఏసీయ్‌..!

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

ఛాన్స్‌ చూసి ఏసీయ్‌..!

ఏసీలు అపహరిస్తూ చిక్కిన ఉద్యోగులు పలు వార్డుల్లో పనిచేయని ఏసీలు పర్యవేక్షణ విషయం గాలికొదిలేసిన అధికారులు ఎండ వేడిమికి ఉక్కపోతతో అల్లాడుతున్న రోగులు

చోరీ నిలువరించేదెలా?

గుంటూరు మెడికల్‌: కంచె చేను మేసిందన్న చందంగా గుంటూరు జీజీహెచ్‌లో పరిస్థితి ఉంది. గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏసీలను అపహరిస్తూ పట్టుబడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కొంతకాలంగా పలు వార్డుల్లో, ఆపరేషన్‌ థియేటర్‌లలో ఏసీలు పనిచేయడం లేదు. ఉక్కపోతతో వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు అల్లాడిపోతున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఏసీలు పనిచేయక వైద్య సేవలు అందించేందుకు చమటోడుస్తున్నారు. ఆసుపత్రికి గుండెకాయలాంటి కీలకమైన అత్యవసర సేవల విభాగంలో ఏసీలు పనిచేయక అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులకు చీమకుట్టినట్‌లైనా లేదు. రోగులు, వైద్యులు అల్లాడిపోతున్నా, అధికారుల గదుల్లో ఏసీలు బాగా చల్లగా పనిచేస్తుండటంతో, రోగుల బాధలు, వైద్యుల బాధలు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరమ్మతుల మాటే మరిచారు

ఆసుపత్రిలో ఏసీల మరమ్మతుల మాట మరిచిపోయారు. మరమ్మతులకు గురైన వాటిని బయటకు తీసి నిబంధనలకు విరుద్ధంగా అమ్మేస్తున్నారు. కొత్తవాటిని కొనుగోలు చేసి అమరుస్తున్నారు. మరమ్మతుల పేరుతో ఆయా వార్డుల్లో తొలగించిన ఏసీలు ఎక్కడకు వెళుతున్నాయో ఎవరికి తెలియడం లేదు. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన వారు మిన్నకుండి పోవడం విమర్శలకు తావిస్తుంది.

మండుతున్న ఎండలు

వేసవి ప్రారంభమైందంటే మార్చి నెల నుంచే గుంటూరులో ఎండలు మండిపోతుంటాయి. గుంటూరు నగరంలో 40 డిగ్రీలకు పైగా ఎండలు ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్‌లో పలు వార్డుల్లో ఏసీలు పనిచేయక రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆపరేషన్‌ థియేటర్లలో సైతం ఏసీలు పనిచేయడం లేదు. ఇటీవల కాన్పుల వార్డులో కూడా ఏసీలు పనిచేయక బాలింతలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండెజబ్బుల వార్డు, ఇతర వార్డులు, క్యాజువాల్టిలో ఎప్పటి నుంచో ఏసీలు పనిచేయడం లేదు. అయినప్పటికీ మరమ్మతులు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం విమర్శలకు తావిస్తుంది. ఏసీలు మరమ్మతులు చేయకపోయినా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిలో బిల్లులు చెల్లించేందుకు ఆసుపత్రి అధికారులు రంగం సిద్ధం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్‌లో 32కుపైగా వైద్య విభాగాలు ఉన్నాయి. 15 ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి. ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్లు ఎంతో కీలకమైన విభాగాలు. వీటిల్లో తప్పనిసరిగా ఏసీలు ఉంటేనే వైద్యులు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోతే రోగుల శరీర ఉష్ణోగ్రత్తల్లో తేడా వచ్చి కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోవడం వల్ల అత్యవసర వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయక వాటి పనితీరులో తేడాల వల్ల ప్రాణాపాయ చికిత్స పొందుతున్న రోగులు ఆపరేషన్‌ చేయించుకున్న రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఆసుపత్రుల్లో ఎంతో కీలకమైన ఏసీలకు మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్‌ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

కొంతకాలంగా ఆసుపత్రిలో ఏసీలు అపహరణకు గురవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బంది సైతం వీటి గురించి చర్చించుకుంటున్నారు. శుక్రవారం ఇరువురు ఉద్యోగులు ఎమర్జెన్సీ వార్డుపైన ఏసీలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించి సీసీ కెమెరాల్లో రికార్డు అవడం ద్వారా పట్టుబడ్డారు. దీంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమై గతంలో పోయిన ఏసీలను కూడా ఎవరు చోరీ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. గతేడాది కేంద్ర మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, పలువురు దాతలు, బ్యాంకులు, పారిశ్రామిక వేత్తలతో జీజీహెచ్‌లోని పేద రోగుల కోసం ఏసీలను డొనేషన్‌ చేయించారు. ఆ ఏసీలు ఎక్కడ ఉన్నాయో, ఏ వార్డులో వాడుతున్నారో ఎవరి వద్దా లెక్కలు లేవు. గతంలో ఉన్న ఏసీలకు సైతం లెక్కలు లేవు. వర్క్‌షాప్‌ ద్వారా ఏసీల నిర్వహణ గతంలో ఉండేది. నేడు వర్క్‌షాప్‌ నుంచి అధికారుల వద్దకు ఏసీల నిర్వహణ బాధ్యతలు మారడంతో ఏసీల అపహరణలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement