బాపట్ల: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూల్యాంకనం జరుగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బాపట్లకు వచ్చిన పదో తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలను పరిశీలించారు. పలు గదులలో జరుగుతున్న మూల్యాంకనం తీరును ఆయన తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్పడకుండా విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రెగ్యులర్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం 750 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1,77,819 మంది విద్యార్థుల ప్రశ్నాపత్రాలు వచ్చాయన్నారు. ఆరో తేదీన ప్రారంభమైన ఈ మూల్యాంకనం 15వ తేదీతో ముగుస్తుందన్నారు. ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా మొదలైందన్నారు. 15వ తేదీ వరకు జరిగే ఈ మూల్యాంకనంలో 60 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, 12,408 మంది విద్యార్థుల ప్రశ్నపత్రాలు వచ్చాయన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు సగటున 40 మంది జవాబుపత్రాలు మూల్యాంకనం చేసేలా ప్రణాళికలు రూపొందించారన్నారు. ప్రభుత్వ అసిస్టెంట్ ఎగ్జామినర్ శివకుమార్, ఇద్దరు ఉప విద్యాశాఖ అధికారులు ఈ కేంద్రాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, ఉపాధ్యాయుడు సాదిక్ తదితరులు ఉన్నారు.
ఆటిజం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలి
ఆటిజంతో బాధపడే పిల్లలకు విద్యాబుద్ధులు, వైద్యంతోపాటు వారి జీవన నైపుణ్యాలను అధికారులు మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సపోర్ట్ సెంటర్‌ను కలెక్టర్ శనివారం పరిశీలించారు. బాధిత పిల్లల ఎదుగుదల కోసం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. విభిన్న ప్రతిభావంతులైన మతిస్థిమితం లేని వారు, ఆటిజం పిల్లలకు సెంటర్ ఎంతో సాయం అందిస్తుందన్నారు. ఈ కేంద్రాల నిర్వహణపై సమగ్ర శిక్ష అభియాన్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆటిజం మూడు దశల్లో వైకల్యం ఉంటుందని వైద్యులు కలెక్టర్‌కు వివరించారు. మానవ వనరుల అభివృద్ధి చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. పిల్లల మేధో శక్తిని పెంచడానికి అనువైన వాతావరణం, పరికరాలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆటిజంతో బాధపడే పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌సింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాజేంద్ర, విద్యాశాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


