వివరాలు వెల్లడించిన జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పెదకాకాని రైల్వే స్టేషన్‌లో ఈనెల 4వ తేదీన జరిగిన హత్యకేసు మిస్టరీని గుంటూరు రైల్వే పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు అరెస్టు చూపారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4వ తేదీన పెదకాకాని రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ చివర భాగంలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి హత్యకు గురి అయినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. సమాచారం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఘటనా ప్రదేశ ంలో మృతి చెందిన వ్యక్తిని పరమడం అనీష్(40) అలియాస్ బ్లేడ్‌గా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును డీఎస్పీ అక్కేశ్వరరావు పర్యవేక్షణలో జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు రైళ్లలో దొంగతనాలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడని మృతుడి పై చైన్నె, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో పలు దొంగతనాలు, నేరాలకు పాల్పడిన కేసులు నమోదు అయినట్లు విచారణలో తెలిసింది. మృతుడు అనీష్ తనతో కలిసి దొంగతనాలు చేసే తోటివారిని నిత్యం వేధిస్తుండటం.. ఆధిపత్య పోరు ప్రధాన కారణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. వీరందరినీ పలు రైల్వే స్టేషన్‌లలో బ్లేడ్ బ్యాచ్‌గా పిలుస్తారని, మృతుడు అనీష్ దొంగతనం చేసిన సొత్తులో ఎక్కువ భాగం తనకు ఇవ్వాలని, తోటి సహచరులపై ఒత్తిడి తేవడం వారిని కూడా పలు మార్లు బ్లేడ్‌తో కోస్తా అని బెదిరించడం వల్ల ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనీష్ వేధింపులను తాళలేక ఈనెల 4వ తేదీన హతమార్చేందుకు పథకం రూపొందించారు.
ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన ఎఫ్.కుమార్ అలియాస్ అంతోని కుమార్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్న దీపేష్ ఎం.ఎస్, అలియాస్ మెంటల్ భాయ్, అనంతపురంకు చెందిన కొప్పుల వెంకటేష్ అలియాస్ వెంటి, అలియాస్ వెంగీ భాయ్లు పెదకాకాని రైల్వే స్టేషన్‌లో అనీష్‌పై బ్లేడ్‌లతో దాడి చేసి అతి కీరాతకంగా హతమార్చి పరారయ్యారు. ఈనెల 9వ తేదీన సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో గుంటూరు రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్–1లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని జీఆర్పీ సీఐ అంజిబాబు పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారించగా అనీష్‌ను హత్య చేసినట్లు అంగీకరించారు. వీరందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసును ఛేదించిన జీఆర్పీ సీఐ జి.అంజిబాబు, ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ మహబూబు సుభాని, కానిస్టేబుల్‌లు వలి, మస్తాన్, ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు, శంకర్, ఆర్పిఎఫ్ ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్, ఏఎస్‌ఐ శ్రీనివాస్ సిబ్బందిని డీఎస్పీ, రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.


