ఆక్వా రైతుల గుండె చెరువు | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతుల గుండె చెరువు

Mar 11 2026 7:45 AM | Updated on Mar 11 2026 7:45 AM

చెరువులు సిద్ధం చేసినా వెనకడుగు వానలు లేకపోవడంతో కన్నీరు భారీగా పెరిగిన ఉప్పుశాతం సాగుకు జంకుతున్న రైతులు

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆక్వా రైతుల గుండె చెరువవుతోంది. సాగు కోసం సిద్ధం చేసిన చెరువులను సైతం ఇప్పుడు ఖాళీగా ఉంచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి ఏడాది జనవరి మాసంలో చెరువులను సిద్ధ్దం చేసి, ఫిబ్రవరి మొదటి వారంలో రొయ్యల సాగుకు శ్రీకారం చుట్టేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి సాగునీరు డ్రైన్లకు విడుదల కాలేదు.

బాపట్ల: సముద్రంలో ఉన్న నీరు పోటు సమయంలో కాలువల్లోకి భారీగా చేరడంతో కాలువ నీటిలో ఉప్పుశాతం భారీగా పెరిగింది. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి మాసాలలో రొయ్యల సాగుకు అనుకూలమైన పేరలి డ్రైయిన్‌, వెదుళ్ళపల్లి డ్రైయిన్‌లో ఉప్పుశాతం (సెల్‌ నీటి శాతం) 15 వరకు ఉండేది. ఈ ఏడాది అది కాస్తా 30 శాతానికి పెరిగింది. ఇంత ఉప్పుశాతంలో రొయ్యల సాగుకు శ్రీకారం చుడితే వాటి పెరుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. సాగు చేసే రైతులు ఈ కారణంగానే జంకుతున్నారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయి..

ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా ఆక్వారైతులు జనవరి మాసంలో చెరువులను సిద్ధం చేసేందుకు బయట వ్యాపారుల నుంచి వడ్డీలకు నగదు తీసుకొచ్చారు. ఎకరం చెరువును సిద్ధం చేయటానికి ట్రాక్టర్‌ సహాయంతో నాలుగుసార్లు దుక్కి దున్నినందుకు రూ. 3 వేలు, చెరువు చదరంగంగా ఉండేందుకు లెవలింగ్‌ చేసినందుకు ట్రాక్టర్‌కు రూ. 5 వేలు, జేసీబీ సహాయంతో కట్టలు ఎగుపోసినందుకు గంటకు రూ. వెయ్యి చొప్పున చెరువు పూర్తిగా శుభ్రం చేసేందుకు సుమారు రూ.4 వేలు, రొయ్యల చెరువులో భూమి నుంచి అంటువ్యాధులు ప్రబలకుండా భూమిలోనే జిప్సమ్‌ వాడకం, రొయ్యలకు పోషకాలను సమృద్ధిగా అందించేందుకు వర్మీకంపోస్ట్‌, చెరువులకు సాగునీటిని అందించేందుకు అవసరమైన కాలువలు, రొయ్యలకు గాలి అందించే ఎయిర్‌రేటర్స్‌ మరమ్మతులు, కల్వర్ట్‌ మరమ్మతులు.. ఇలా అన్నీ కలిపి ఎకరం చెరువుకు రూ. 50 వేల వరకు ఖర్చు చేశారు. ఈ ఏడాది కాలువల్లో ఉప్పుశాతం ఎక్కువగా ఉండటంతో సాగు ప్రశ్నార్థంకంగా మారిందని ఆక్వా రైతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement