ఇంకొల్లు(చినగంజాం): బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన హెడ్‌మాస్టర్‌కు కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఎస్సై జి. సురేష్ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. 2019లో హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న కొడవలివారిపాలెం గ్రామానికి చెందిన నిందితుడు బడుగు వీరయ్య (40) ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నేరాన్ని తగిన సాక్ష్యాధారాలతో నిరూపించడంతో ఒంగోలు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి కె. శైలజ మంగళవారం తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. నిందితుడికి మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.8 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నగరం: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సజ్జావారిపాలెంలో జరిగింది. ఎస్‌ఐ బండ్ల భార్గవ్ సమాచారం మేరకు రేపల్లె–నిజాంపట్నం రహదారిలో సజ్జావారిపాలెం మసీదు వద్ద ఈనెల 5వ తేదీన నడుచుకుంటూ వెళ్తున్న సుమారు 35 సంవత్సరాల వయసుగల గుర్తు తెలియని వ్యక్తిని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యక్తికి గాయాలు కావడంతో 108 ద్వారా నగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యసేవల కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ భార్గవ్ మంగళవారం వెల్లడించారు. ఈ ఘటనపై గ్రామ వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి సమాచారం తెలిసిన వారు. నగరం పోలీసువారిని లేదా 9440900877ను సంప్రదించాలని కోరారు.
గుండెపోటుతో
కానిస్టేబుల్ మృతి
మంగళగిరి టౌన్: ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కొలసాని వెంకటేశ్వరరావు(60) మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడ రామవరప్పాడులో నివాసముంటున్న కొలసాని వెంకటేశ్వరరావు 1980లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా చేరారు. 2005లో ఏఆర్ కానిస్టేబుల్‌గా, 2019లో సివిల్ పీసీగా బదిలీ అయ్యి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. సివిల్ కానిస్టేబుల్‌గా ఉంటూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీలోని డాగ్ స్క్వాడ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈయనకు 2008లో గుండెజబ్బు రావడంతో స్టంట్స్ వేశారు. 2011లో బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ గ్రౌండ్‌లో పీపీటీ టెస్ట్‌లో వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించగా, పరీక్షించిన వైద్యులు వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగార్జుననగర్‌లో వివాహిత బలవన్మరణం
సత్తెనపల్లి: వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని నాగార్జుననగర్‌లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నాగార్జుననగర్‌కు చెందిన జెల్లి ఆదిలక్ష్మి (28) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మ రణానికి పాల్పడింది. మృతురాలికి భర్త నాగరాజు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 10 ఏళ్ల క్రితం వివాహం కాగా కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆదిలక్ష్మీ తిరిగి వచ్చింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురౌతూ బలవన్మరణానికి పాల్పడింది. తన మరణానికి ఎవరు కారకులు కాదని, భర్త, అత్త,మామలు మంచి వాళ్ళు అంటూ ఆమె లేఖ రాసింది. బలవన్మరణానికి గల కారణం ఏమిటనేది రాయలేదు. సంఘటనా స్థలాన్ని పట్టణ ఎస్‌ఐ పి. పవన్‌కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి కిలారి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు బ్రాంచి కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం
నకరికల్లు: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మండలంలోని కండ్లకుంట సమీపంలోని గుంటూరు బ్రాంచి కెనాల్‌లో గుర్తించినట్లు ఎస్‌ఐ కె.సతీష్ మంగళవారం తెలిపారు. గుర్తించిన వ్యక్తికి సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. లేత ఆకుపచ్చ రంగు నిక్కరు, సిమెంట్‌రంగు టీషర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు. కేసీపీ పవర్‌ప్లాంటు–4 వద్ద మృతదేహం లభ్యమైందన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి నరసరావుపేట ఏరియా వైద్యశాలలోని మార్చురీకి తరలించామన్నారు. ఆచూకీ తెలిసినవారు 9440796246, 9966460427 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.


