ఫ్లెక్సీలు తొలగించాలని డీఎస్పీకి చెప్పిన కలెక్టర్ కానీ అలాగే ఉన్న ఫ్లెక్సీలు ప్రజాస్వామ్యబద్ధంగా అడుగులు వేస్తున్న వైఎస్సార్ సీపీ
పోలీసులకు, అధికార పార్టీకి వర్తించదా?
చీరాల అర్బన్: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు ఆధ్వర్యంలో పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్‌ను కలిశారు. గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహ సర్కిల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని రాత పూర్వకంగా కోరారు. దీనిపై కలెక్టర్ వి.వినోద్‌కుమార్ స్పందించారు. వెంటనే ఫ్లెక్సీలను తొలగించాలని డీఎస్పీ మహ్మద్ మొయిన్‌కు చెప్పారు. వివాదాలకు తావులేకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంగా డీఎస్పీ కలెక్టర్‌కు వివరించారు. ఆ సమాధానానికి కలెక్టర్ సంతృప్తి చెందలేదు. కేవలం అక్కడ మాత్రమే కాకుండా ఎక్కడైనా విగ్రహాల వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని, వాటిని తొలగించాలని డీఎస్పీకి కలెక్టర్ చెప్పారు. అయితే మంగళవారం సాయంత్రం వరకు వైఎస్సార్ సర్కిల్లోని ఫ్లెక్సీలు అలానే ఉన్నాయి. దీంతో కలెక్టర్ ఉత్తర్వులను కూడా అమలు చేయరా అని జనాల్లో చర్చ నడుస్తోంది.
మున్సిపల్ హెచ్చరిక బోర్డు ఉన్నా..
గడియార స్తంభం సెంటర్లోని వైఎస్‌ఆర్ విగ్రహ సర్కిల్లో ఎలాంటి ఫ్లెక్సీలు లేదా హోర్డింగులు ఏర్పాటు చేయకూడదని మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయినా టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు, పోలీస్ వారికి సంబంధించిన ఫ్లెక్సీ ఒకటి, ఓ విద్యా సంస్థకు చెందిన ఫ్లెక్సీ ఒకటి వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేశారు. దీనిపై గతంలో మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్‌ను వివరణ అడగ్గా గతంలో టౌన్ ప్లానింగ్ వారు ఆ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి ఉంటారు. పరిశీలించి తగిన చర్యలు చేపడతామని చెప్పారు. అయితే ఆ తరువాత కూడా అక్కడ ఫ్లెక్సీలు సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ ఉన్న ఫ్లెక్సీలను తొలగించలేదు.
కవ్వింపు చర్యలు
గతంలో టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు సమయంలో జరిగిన సంఘటనలు కవ్వింపుకు దారి తీశాయి. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ నాయకులు శాంతియుతంగా అక్కడ ఫ్లెక్సీని తొలగించాలని ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. ఆ క్రమంలో పోలీసులు అక్కడున్న ఫ్లెక్సీని తొలగించారు. అయితే ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలో అదే ఫ్లెక్సీ అక్కడ వెలిసింది. అందుకు టీడీపీ రాజకీయ ఒత్తిడే కారణమనేది బహిరంగ రహస్యం. అదే రీతిలో వైఎస్సార్ సీపీ కూడా ఆలోచిస్తే పరిస్థితి ఏంటనే కోణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు.
పోలీస్‌శాఖకు సంబంధించిన ఫ్లెక్సీ
ఉన్న ఫ్లెక్సీ వివాదం చాలదన్నట్లు పోలీస్‌శాఖకు సంబంధించిన ఓ ఫ్లెక్సీని స్థానిక పోలీసులు అదే సర్కిల్లో ఏర్పాటు చేశారు. వివాదాలకు తావులేకుండా ఉండేందుకు తాము ఫ్లెక్సీ అక్కడ పెట్టామనేది పోలీస్ వాదన. అయితే సర్కిల్లో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలేదనేది ప్రజల ప్రశ్న.
రాజశేఖర్‌రెడ్డి విగ్రహ సర్కిల్లో ఎలాంటి ఫ్లెక్సీలు లేదా హోర్డింగులు ఏర్పాటు చేయకూడదనే మున్సిపల్ హెచ్చరిక బోర్డు సంగతి ఏంటి?. పాలన సాగిస్తున్న పాలకపక్షం నాయకులు, లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సిన పోలీసులు ఆ సర్కిల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నట్లు? ఆ హెచ్చరిక బోర్డు వారికి వర్తించదా అని ప్రజలు విమర్శిస్తున్నారు. అంతిమంగా కలెక్టర్ మాటలను కూడా ఖాతరు చేయరా అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా వాస్తవాలను, జరుగుతున్న పరిణామాలను ప్రజలు సునిశితంగా గమనిస్తున్నారన్న విషయాన్ని అటు పాలకులు, ఇటు అధికారులు గుర్తెరగాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేదంటే సరైన సమయంలో సరైన సమాధానం చెప్తారని వ్యాఖ్యానిస్తున్నారు.


