ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కళ్లద్దాలు పంపిణీ
నగరంపాలెం: సమాజ సేవాభావనతో ముందుకు రావడం అభినందనీయమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గుంటూరు ట్రాఫిక్ పోలీసుల సౌకర్యార్థం డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ అందించిన 150 రక్షణ కళ్లద్దాలను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని సమావేశ మందిరంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బందికి అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎండలో, అధిక వేడి, ధూళిలో బహిరంగ ప్రదేశాల్లో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి రక్షణకు గ్లాసులను అందించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఉపాధ్యక్షుడు (ఆపరేషన్స్) శ్రీకాంత్ మాట్లాడుతూ సాంకేతిక సదుపాయాలతో సమగ్ర నేత్ర వైద్య సేవలన్నీ ఒకేచోట అందిస్తున్నామని అన్నారు. ప్రతి ఆరు నెలలకు ఓసారి పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకై ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. రెటినా వైద్య నిపుణురాలు కల్పనారెడ్డి, వైద్యులు సులోచన, శివాని, ప్రసన్న, బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ జయకుమార్ పాల్గొన్నారు.


