భట్టిప్రోలు: పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు చెందిన బైక్‌పై పెట్రోలు పోసి దహనం చేసిన సంఘటన ఇది. భట్టిప్రోలు హెడ్ కానిస్టేబుల్ వివరాల మేరకు, ఈ నెల 2వ తేదీ రాత్రి భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి రథోత్సవంలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, ఎస్‌ఐ శివయ్య, సిబ్బంది బందోబస్తు విధులలో ఉన్నారు. ఊరేగింపు అద్దేపల్లి మసీదు వద్దకు వచ్చేసరికి భట్టిప్రోలు గ్రామానికి చెందిన బట్టు లీలాసాయికుమార్ మద్యం తాగి రథం చప్టా వేసే వారితో గొడవ పడుతున్నాడు. ఈ సమయంలో ఎస్‌ఐ, స్టేషన్ సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని మందలించి పంపించారు. రథోత్సవం ముగిసిన తరువాత బట్టు లీలాసాయి కుమార్, మరి కొంతమంది ఆదిన గౌతమ్ సాయి, సిరిబోయిన శ్రీనివాసరావు, ఆదిన నాగ సాయి శ్రీనివాసరావులతో కలిసి వచ్చి తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఎస్‌ఐ శివయ్య ఇంటిముందు పార్క్ చేసిన బైక్‌పైపోసి నిప్పు అంటించారు. ఎస్‌ఐ శివయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగా వారందరూ కలసి స్కూటీపై పారిపోయారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వేమూరు: పేద ప్రజలకు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కో–ఆర్డినేటర్ ఆసుపత్రి సర్వీసు అధికారి విజయలక్ష్మి తెలిపారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సీనియరు డాక్టర్లు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలు అందించడంలో ముందు ఉందని చెప్పారు. రోగులకు 24 గంటలు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సామాజి ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సయ్యద్ జెరినా పర్విన్, డాక్టర్లు బుల్లా భరత్, అనిల్ కుమార్, ఫాతి మునీస్సా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


