ఫుడ్ బాస్కెట్‌తో సమతుల ఆహారం
మార్టూరు: సామాన్య కుటుంబాలకు సైతం సమతుల పోషకాహారాన్ని అందించటమే లక్ష్యంగా ఫుడ్ బాస్కెట్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు డీఆర్డీఏ బాపట్ల జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ బత్తిన సింగయ్య అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో గురువారం గ్రామైక్య సంఘ ప్రతినిధులు, వెలుగు, ప్రకృతి సేద్య సిబ్బందితో గత రెండు రోజులుగా నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రకృతి సేద్య సిబ్బంది, రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు సామాన్య, పేద కుటుంబాలకు అవసరమైన పోషక విలువలు కలిగిన నిత్యావసర సరుకులను ఇంటింటికీ అందించటమే ఫుడ్ బాస్కెట్ పథకం లక్ష్యమన్నారు. ఈ పథకాన్ని జిల్లాలో మార్టూరు మండలం ప్రకాశం జిల్లాలోని అద్దంకి, కొరిశపాడు మండలాల్లో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా డీఆర్డీఏ, వెలుగు, రైతు సాధికార సంస్థల ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్లు సింగయ్య తెలిపారు. గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను సేకరించి స్వయం సహాయక సభ్యులకు అందిస్తారన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్‌లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యస్థాయిలు మెరుగు పరుచుకోవాలన్నారు.
వెలుగు డీపీఎం సనిత గ్రూపు సభ్యులకు ఫుడ్ బాస్కెట్ గురించి అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ శాఖ ఏపీడీ జే.మోహన్ రసాయన రహిత కూరగాయలు పండించే విధానం గురించి సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్టూరు, కొరిశపాడు ఏపీఎంలు సురేంద్ర, మాణిక్యరావు, ఎంటీఎల్ రాజశేఖర్, సోనియా, శశికళ, నూతనశ్రీ, వెలుగు సీసీలు మండల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
డీఆర్డీఏ జిల్లా పీడీ సింగయ్య


