
ఆచార్య నాగార్జునుడి బోధనలు ఆచరణీయం
చికాగో బౌద్ధాలయం సందర్శనలో శివనాగిరెడ్డి
విజయపురి సౌత్: ఆచార్య నాగార్జునుడి బోధనలు నేటికీ ఆచరణీయమని ప్రముఖ బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఈ మేరకు మిడ్ వెస్ట్ బౌద్ధాలయాన్ని గురువారం సందర్శించిన సందర్భంగా ఆయన ప్రసంగించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య నాగార్జునుడి మధ్యమమార్గం, శూన్యవాదం, నైతిక వర్తన, సచ్ఛీలత, వివేకం, శాశ్వతానందాన్నిచ్చే బుద్ధుని చతురార్య సత్యాలు, ఆర్య అష్టాంగిక మార్గాలను ఆచరిస్తే ప్రస్తుత సమాజంలోని రుగ్మతలను నిర్మూలించవచ్చని తన ప్రసంగంలో ఆయన వివరించారు. బౌద్ధ సంస్కృతిని పరిరక్షించటానికి తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో బుద్ధవనాన్ని నిర్మించారని గుర్తుచేశారు. అనంతరం ఆలయ ప్రధానాచార్యులు పూజ్య గ్యాదో కోనో వారి ప్రచురణలను శివనాగిరెడ్డికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో చికాగో సాహితీ మిత్రులు, సంస్థ కార్యదర్శి జయదేవ్ మెట్టుపల్లి పాల్గొన్నారు.