
అమరుల స్ఫూర్తితో పోరాటం
సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి బాబూరావు
చీరాల అర్బన్: బషీర్‌బాగ్ కాల్పుల్లో ఆశువులు బాసిన విద్యుత్ అమర వీరుల స్ఫూర్తితో నేడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు వామపక్షాలు, ప్రజా సంఘాలు పూనుకున్నాయని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్.బాబూరావు అన్నారు. 2000 ఆగస్టు 28న హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో జరిగిన విద్యుత్ వ్యతిరేక ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం పోలీసు కాల్పుల దమనకాండలో విష్ణువర్దన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామి అనే ముగ్గురు కార్యకర్తలు అశువులు బాసి నేటికీ 25 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ అమరవీరుల సంస్మరణ ప్రతిజ్ఞ దినం కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ గురువారం స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ పేద ప్రజలను దోపిడీకి గురిచేసి ప్రభుత్వ విధానాలను అందరూ కలిసి ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ పంపిణీ, నిర్వహణ వ్యవస్థలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అధికారంలో ఉన్నా ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలనే అమలు చేస్తున్నారని, దీనిలో భాగంగానే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని మొత్తం అదాని వంటి కార్పొరేట్లకు కట్ట బెడుతుందన్నారు. దీని ఫలితంగా ప్రజలపై భారాలు పడుతున్నాయన్నారు. ప్రజా పోరాటం ద్వారా ఈ సంస్కరణలకు పాతర వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమకు అధికారం ఇస్తే స్మార్ట్ మీటర్ల చార్జీలు.. అదనపు చార్జీలు, సర్దుబాటు చార్జీలు రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మాట మార్చిందన్నారు. అవే స్మార్ట్ మీటర్లు, విద్యుత్ భారాలను యథావిధిగా ప్రజలపై వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం.వసంతరావు, డి.నారపరెడ్డి, ఎల్.జయరాజు, ఐవీ ప్రసాద్, బి.సుబ్బారావు, ఇమ్మానియేలు, సీపీఐ నాయకులు బత్తుల సామేలు, పైడియ్య, ప్రజాసంఘాల నాయకులు మాచర్ల మోహనరావు, చుండూరి వాసు, బలహీనవర్గాల సమాఖ్య నాయకులు గోసాల ఆశీర్వాదం, తాటిబోయిన లక్ష్మీప్రసాద్, శీలం వెంకటేశ్వర్లు, ఎన్.మోహన్‌కుమార్ ధర్మా తదితరులు పాల్గొన్నారు.