
అడిగినంత ఇస్తే రికవరీలు తగ్గిస్తాం
సామాజిక తనిఖీల అక్రమాలను కప్పిపుచ్చుతాం ఉపాధి హామీలో బంపరాఫర్లు ముడుపులు ఎక్కువిస్తే భారీగా రికవరీలు ముడుపులు ఇవ్వకపోతే నో రికవరీ తలలు పట్టుకుంటున్న కొందరు ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోలు డ్వామా అధికారి తీరుపై సర్వత్రా ఆగ్రహం కుప్పలు తెప్పలుగా అక్రమాలు వెలుగు చూస్తున్నా పట్టించుకోనిఉన్నతాధికారులు
సాక్షి ప్రతినిధి,బాపట్ల: జిల్లా ఉపాధి హామీలో అక్రమాల వ్యవహారం నీకింత..నాకింత అనే చందంగా మారింది. ఫేక్ మస్టర్లు, పనిచేయకుండానే బిల్లులతో కొందరు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. జిల్లా అధికారి నేను అడిగినంత ఇస్తే .. అక్రమాలను కప్పిపుచ్చుతానంటూ బేరం పెడుతున్నారు. జిల్లా అధికారి ముడుపులిచ్చిన వారి అక్రమాలను మరుగునపెడుతున్నారు. వాటా ఇవ్వని వారిని రికవరీ పేరుతో బుక్ చేస్తున్నట్లు కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఉపాధిలో అక్రమాలు, అవినీతి వ్యవహారం కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్నా.. ఉన్నతాధికారులు మాత్రం చర్యలకు మీనమేషాలు లెక్కించడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
అద్దంకి మండలంలో అక్రమాలు వెల్లువ
ఉపాధి హామీ పనుల్లో అద్దంకి మండలంలో జూన్‌లో జరిగిన సామాజిక తనిఖీల్లో ఈ విషయం తేటతెల్లమైనట్లు సమాచారం. మండలంలోని 26 గ్రామ పంచాయతీల పరిధిలో 2024–2025 ఆర్థిక సంవత్సరంలో రూ.8,52,33,219 మేర ఉపాధి హామీ పనులు జరగ్గా 336 పనులకు సంబంధించి రూ.82,74,327 మేర పనుల్లో అవినీతి జరిగిందని కమిటీ తేల్చింది. కానీ 124 పనులకు సంబంధించి రూ.29,25,256లు మాత్రమే డీవియేషన్ ఉందని ప్రొసీడింగ్ అధికారి హోదాలో డ్వామా పీడీ అంగీకరించినా... 82 పనులకు చెందిన రూ.1,69,106 మాత్రమే రికవరీ పెట్టినట్లు సమాచారం. మిగిలిన రూ.19.34 లక్షలకు సంబంధించిన పనులను రిఫర్డ్ కింద రాసిన పీవో రూ.8,21,426లకు చెందిన పనులను రెక్టిఫికేషన్, మిగిలిన రూ.53.49 లక్షలకు చెందిన పనుల్లో అవినీతి జరగలేదని డ్రాప్‌డ్ రాశారు.
నగరంలో మాత్రం రూ.48 లక్షల రికవరీ
అద్దంకి, చీరాల మండలాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని 17వ విడత సామాజిక తనిఖీ తేల్చగా దానిని తోసిపుచ్చి మొక్కుబడిగా మాత్రమే రికవరీలు విధించిన డ్వామా అధికారి నగరం మండలంలో జరిగిన అవినీతి విషయంలో భిన్నంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. నగరం మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.9,56,57,239 పనులు జరగ్గా రూ.1,08,60,208 అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీల్లో తేల్చారు. రూ.48,01,833 డీవియేషన్ ఉన్నట్లు అంగీకరించిన డ్వామా అధికారి రూ.48,01,833 మొత్తాన్ని పూర్తిగా రికవరీ కింద చూపడం గమనార్హం. నగరం మండలానికి చెందిన కొందరు ఫీల్డ్, టెక్నికల్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతోపాటు ఏపీవో ఇతర అధికారులు ముడుపులు చెల్లించేందుకు ససేమిరా అనగా కొందరు మాత్రమే అరకొరగా ముట్టజెప్పడంతో ఆగ్రహించిన జిల్లా అధికారి డీవియేషన్ చూపిన మొత్తాన్ని రికవరీ కింద రాశారన్న ఆరోపణలున్నాయి. ఉపాధి హామీలో పెద్దఎత్తున అక్రమాలు వెలుగు చూస్తున్నా.. ఉన్నతాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
చీరాలలో రూ.48.51 లక్షలకు రూ.1.19 లక్షలే రికవరీ
చీరాల మండలంలో 14 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.9,16,80,215 పనులు జరగ్గా 246 పనులకు సంబంధించి రూ.48,51,541 మాత్రమే అవినీతి జరిగినట్లు 17వ విడత సామాజిక తనిఖీ తేల్చగా డ్వామా పీడీ మాత్రం రూ.29,30,909 డీవియేషన్ ఉందని అంగీకరించారు. కానీ రూ.1,19,915 మాత్రమే అవినీతి జరిగిందని రికవరీ పెట్టారు. మిగిలిన రూ.21,53,707 మొత్తాన్ని రిఫర్డ్ కింద, రూ.19,20,632 డ్రాప్‌డ్ అమౌంట్‌గా, రూ.6,57,289 మొత్తాన్ని రిక్టిఫికేషన్ కింద చూపి సామాజిక తనిఖీలో తేలిన అవినీతిని మాఫీచేశారు. అద్దంకి, చీరాల రెండు మండలాల్లో పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ తేల్చగా తక్కువ రికవరీలు చూపడం వెనుక లక్షల్లో డబ్బులు చేతులు మారినట్లు డ్వామాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.