
నీరందక ఎండుతున్న పంటలు
వరదలతో నిండుకుండలా కృష్ణమ్మ కాలువలకు విడుదల కాని నీరు మోటార్లతో పొలాలకు నీరు రైతులపై అదనపు భారం
రేపల్లె: కృష్ణా పరీవాహక ప్రాంతంలోని పంట పొలాలను వరదలు ముంచెత్తుతుండగా..మరో వైపు నీరు అందక వెద పద్ధతిలో సాగు చేసిన వరి పంట ఎండిపోతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రేపల్లె నియోజకవర్గం పరిధిలోని రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలలో 85 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తుంటారు. వెద పద్ధతిలో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే సాగుచేసినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కాలువలకు నీరు విడుదల చేయలేదు. దీంతో పంటలకు నీరు అందకపోవటంతో ఎండిపోతున్నాయి. చివరకు ఇంజిన్ల ద్వారా నీరు పెడుతున్నారు. తక్కువ ఖర్చు అవుతుందని వెద పద్ధతిలో సాగు చేస్తే చివరకు తడిసిమోపెడు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పెనుమూడి, చాటగడ్డ, మైనేనివారిపాలెం, చోడాయపాలెం, కై తేపల్లి, పోటుమేరక, నగరం, ఈదుపల్లి, పెద్దమట్టపూడి, చిన్నమట్లపూడి, సిరిపుడి, ముత్తుపల్లి, ఆరేపల్లి తదితర గ్రామాలలో ఇప్పటికే సాగు చేస్తున్న పంట ఎండుముఖం పట్టడంతో రైతులు విలవిలలాడుతున్నారు. అధికారులు స్పందించి కాలువలకు నీరు విడుదల చేసి పంటను కాపాడాలని కోరుతున్నారు.

నీరందక ఎండుతున్న పంటలు