
దివ్యాంగుల తిప్పలు
రీ వెరిఫికేషన్‌కు హాజరుకావాలంటూ నోటీసులు సవాలక్ష కారణాలతో వెనక్కి పంపుతున్న సిబ్బంది ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడుతున్న దివ్యాంగులు
రేపల్లె: ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏ పని చేసుకోలేని కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల పింఛన్లు తొలగించాలనే కుట్రతో ప్రభుత్వం ఇటీవల బాపట్ల జిల్లాలో 3829 మంది పింఛన్‌దారులకు నోటీసులు జారీ చేసింది. సదరం క్యాంపునకు వెళ్లి వికలాంగుల శాతాన్ని ధృవీకరించే సర్టిఫికెట్ పొందాలని నోటీసులో పేర్కొంది. కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు అష్ట కష్టాలు పడుతూ తమకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన క్యాంపునకు హాజరైతే మీకు ఇక్కడ చూడడం కుదరదని సదరం క్యాంపు సిబ్బంది తెలియజేస్తున్నారు. దీంతో వికలాంగులు నిరాశగా వెనుక తిరుగుతున్నారు. మాకు ఇచ్చిన షెడ్యూల్లో ఇదే హాస్పిటల్ ఈ రోజే హాజరు కావాలని ఉంది కదా సార్ అని దివ్యాంగులు అడిగితే రిపీట్ డాక్టర్ చూడకూడదు సాంకేతిక లోపాల కారణంగా మండల పరిషత్ అధికారులు మీ షెడ్యూల్ ఖరారు చేశారు, వెళ్లి వారిని కలవండి మరలా షెడ్యూల్ ఇస్తారంటూ సమాధానం చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో దివ్యాంగులు వెనుదిరుగుతున్నారు. రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం జరిగిన సదరం క్యాంపునకు రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలోని వివిధ గ్రామాల నుంచి 45 మంది దివ్యాంగులు హాజరయ్యారు. వారిలో ఆరుగురు దివ్యాంగులకు రిపీట్ డాక్టర్ కారణాలు చెబుతూ తిప్పి పంపడంతో నిరాశగా వెనుదిరిగారు. దివ్యాంగులమని చూడకుండా ఇష్టానుసారంగా తిప్పుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమూరు మండలం చంపాడు గ్రామానికి చెందిన బందెల ముసలయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే తమ షెడ్యూల్ ఇది కాదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొన్నేళ్లుగా పింఛన్ పొందుతున్నానని 80 శాతం వికలాంగత్వం ఉన్నా రీ వెరిఫికేషన్ చేయించుకోవాలని నోటీస్ ఇవ్వడంతో తప్పక ఇక్కడికి వచ్చానన్నారు. వెరిఫికేషన్ కాకపోతే పింఛన్ రాదని అధికారులు చెబుతున్నారని తనకు పింఛన్ వస్తుందా లేదా అని బాధ వ్యక్తం చేశాడు. ప్రభుత్వం, అధికారులు ఏ ఆధారం లేని దివ్యాంగులను ఇబ్బందులు గురి చేయకుండా సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు.

దివ్యాంగుల తిప్పలు