
చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
చీరాల: జిల్లా కేంద్రంగా చీరాలను ప్రకటించాలని కోరుతూ చేపట్టనున్న కార్యక్రమానికి మద్దతు ప్రకటించాలని చీరాల జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజు బుధవారం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కోరారు. ఎన్‌ఆర్‌పీఎం హైస్కూలులో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి, అందరి మద్దతు కోరారు. బాపట్ల జిల్లాను దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జిల్లాగా పేరు మార్చాలని, చీరాలను జిల్లా కేంద్రంగా చేయాలనే ప్రతిపాదనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రామకృష్ణ, సురేష్, ప్రసాద్, మురళి, శ్రీరామ్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించడానికి ఈనెల 29న జిల్లా పునర్విభజన మంత్రుల కమిటీ రానుంది. ఈ నేపథ్యంలో చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులంతా వచ్చి అర్జీల రూపంలో అందించాలని దేవరాజ్ కోరారు.
అబాకస్ పోటీలలో బాపట్ల విద్యార్థుల ప్రతిభ
బాపట్ల అర్బన్: జాతీయ స్థాయి అబాకస్ పోటీల్లో బాపట్లకు చెందిన యూసిమాస్ విద్యార్థులు సత్తా చాట్టారు. హైదరాబాద్ గచ్చి బౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన పోటీల్లో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుంచి 4 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో బాపట్ల నుంచి యూసిమాస్ విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి స్టేజ్ మీద బాపట్ల పేరును మారు మోగించారు. బాపట్ల కు చెందిన మంతెన కృతిక్ జాతీయస్థాయిలో నాలుగో స్థానం, దర్శి చేతన శేష ఆర్యాహి, భమిడిపల్లి శ్రీ వైష్ణవి ఆరవ స్థానంలో నిలిచి మెరిట్ ట్రోఫీలను కై వశం చేసుకున్నారు. యూసిమాస్ సంస్థ బాపట్ల డైరెక్టర్లు వనమా స్మైలీ, బొనిగల రాజేంద్రప్రసాద్‌లను పలువురు అభినందించారు.
ఉరి పెట్టుకుని యువకుడు ఆత్మహత్య
రేపల్లె : మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో ఉరి పెట్టుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రేపల్లె పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం.. మూడవ వార్డుకు చెందిన కోనేటి రాజేష్ కుమార్ (34), లావణ్యలకు 11 సంవత్సరాల కిందట వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన రాజేష్ కుమార్ డబ్బులు కోసం తరచూ భార్యను వేధిస్తూ ఉండేవాడు. బుధవారం మద్యానికి డబ్బులు అడగగా భార్య లేవని చెప్పడంతో చనిపోతానని బెదిరించాడు. అన్నట్లుగా మధ్యాహ్నం ఇంటిలో ఫ్యానుకు ఊరి పెట్టుకొని మృతి చెందాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
డీ ఫార్మసీలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో రెండేళ్ల కాలపరిమితి గల డీఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ గడువును సాంకేతిక విద్యాశాఖ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జాస్తి ఉషారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ రెగ్యులర్, దూరవిద్య ద్వారా బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థినులతో పాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డు నుంచి తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు కలిగిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు ప్రభుత్వం ద్వారా అడ్మిషన్ ఫీజులో మినహాయింపుతోపాటు ఉపకార వేతనాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినులకు కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి ఉందని తెలిపారు. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లతోపాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, దరఖాస్తు రుసుం రూ.400తో కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఇతర వివరాలకు 92471 20305, 98480 38769 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి