
కృష్ణాకు తగ్గిన వరద
సోమవారం సాయంత్రానికి 2.50 లక్ష్యల క్యూసెక్కులు దిగువకు ఊపిరి పీల్చుకున్న లంక గ్రామాలు జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు వాన నిజాంపట్నంలో అత్యధికంగా 32.8 మిల్లీమీటర్ల వర్షం సగటున 11.99 మిల్లీమీటర్లు వర్షం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 13న జిల్లావ్యాప్తంగా భారీవర్షాలు కురవగా సోమవారం రాత్రి మరోమారు ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా నిజాంపట్నం మండలంలో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా కర్లపాలెం, నగరంలలో 29.4 ఎంఎం, బాపట్లలో 24.8, పిట్టలవానిపాలెంలో 22.6, పర్చూరులో 21.2, రేపల్లె, సంతమాగులూరులలో 16.2, మార్టూరులో 12.4, బల్లికురవలో 12.2, చీరాలలో 9.2, అమృతలూరులో 8.2 మిల్లీమీటర్ల చొప్పున జిల్లాలో సగటున 11.99 ఎంఎం వర్షం కురిసింది.
కృష్ణాకు తగ్గిన వరద
కృష్ణా నదికి వరద తగ్గడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి సోమవారం ఉదయం దిగువకు 2.80 లక్షల క్యూసెక్కులు విడుదల చేసిన అధికారులు సాయంత్రానికి దీనిని 2.50 లక్షలకు తగ్గించారు. దీంతో కొల్లూరు మండలంలోని లంక గ్రామాలతోపాటు కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎటువంటి వరద ముప్పు లేదని అధికారులు తెలిపారు.
ఈనెల 13 ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు 5.80లక్షల క్యూసెక్కులు విడుదల చేసిన విషయం తెలిసిందే. కృష్ణానది ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయన్న సమాచారంతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం సోమవారం జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని రద్దు చేసుకొని అందరూ వేమూరు నియోజకవర్గానికి తరలివెళ్లారు. కానీ వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలతోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.