
ఆటోకు ఉచిత దెబ్బ
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం ఉపాధి కోల్పోనున్న ఆటో డ్రైవర్లు రూ.15 వేలు ఊసే ఎత్తని సర్కార్ ఏడాదిగా ఆందోళన చేసినా పట్టించుకోని వైనం కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రాక కొందరు...చదువు లేక మరికొందరు ఆటోలను నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఆటో కొనుగోలు చేస్తున్నారు. నెలనెలా ఈఎంఐలు చెల్లిస్తూ మిగిలిన సొమ్మును కుటుంబాలను నడుపుతున్నారు. మరికొందరు ఆటోలు అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో ఆటోవాలాల ఉపాధికి దెబ్బతగిలింది. ఎన్నికల సమయంలో ఆటోవాలాలకు ఏడాదికి రూ.15000 ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు దాని ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వ నిర్ణయంపై డ్రైవర్లు మండిపడుతున్నారు.
బాపట్ల అర్బన్: కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఆటో డ్రైవర్లలో ఆందోళన మొదలైంది. సీ్త్ర శక్తి పథకం తమ ఉపాధిని దెబ్బతీసేలా ఉందని భయపడుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేశామని, రేపటి నుంచి అప్పులు ఎలా తీర్చాలని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో దాదాపు 30 వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వీటిపై ఆధారపడి జీవించే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది.
14 నెలలైనా అమలు కాని హామీ
తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ.15000 ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆర్థిక సాయంతోపాటు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని నమ్మబలికింది. అధికారం చేపట్టి 14 నెలలు అవుతున్నా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. అమలు చేస్తామని స్పష్టమైన హామీ లేదు. దీనికితోడు సంక్షేమ బోర్డు మాటే ఎత్తటం లేదు. తక్కువ వడ్డీతో ఆటోలకు రుణాలు ఇస్తామని హామీకి అతీగతి లేదు. సీ్త్ర శక్తి పథకం అమలు చేయడంతో ఆటో కార్మికులు జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఉచిత బస్సు ప్రభావంతో ఫైనాన్‌న్స్ చెల్లించలేని పరిస్థితి వస్తుందని వాపోతున్నారు.