
దేశ రక్షణ కోసం రెడ్ షర్ట్ ఆర్మీ సిద్ధంకావాలి
మంగళగిరి టౌన్: బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, దేశ రక్షణ కోసం రెడ్ షర్ట్ ఆర్మీ సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఒంగోలులో ఈనెల 28న జరగనున్న రాష్ట్ర మహాసభల్లో పాల్గొనున్న రెడ్‌షర్ట్ వలంటీర్లకు మంగళగిరి నగర పరిధిలోని బైపాస్ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి వద్ద గల ప్రాంగణంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని శుక్రవారాన్ని ఆయన నాయకులతో కలసి సందర్శించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చురుకై న పాత్ర పోషించాలని తెలిపారు. దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రెడ్‌షర్ట్ ఆర్మీ సిద్ధం కావాలని చెప్పా రు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేసి సామాజిక చైతన్యం పెంపొందించడంలో ముందుండి కృషి చేయాలని సూచించారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా నేటి ప్రభుత్వాలు కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నితిరుపతయ్య, పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, నాయకులు కంచర్ల కాశయ్య, జాలాది జాన్‌బాబు పాల్గొన్నారు.