
ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి లారీ డ్రైవర్ మృతి
పర్చూరు(చినగంజాం): ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన సంఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటన శుక్రవారం పర్చూరు మండల పరిధిలోని తిమ్మరాజుపాలెం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. చీరాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నరసరావుపేట నుంచి చీరాల వైపు వస్తోంది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద బస్సులోని కొందరు ప్రయాణికులను దించి అప్పుడే హైవే ఎక్కుతోంది. ఆ సమయంలో పర్చూరు నుంచి వస్తున్న లోడు లారీ ఆర్టీసీ బస్సును బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ వైపు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో లారీని నడుపుతున్న డ్రైవర్ వాసుమల్ల సాల్మన్‌రాజు (43)కు తీవ్ర గాయాలై లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పర్చూరు ఎస్‌ఐ జీవీ చౌదరి, ఏఎస్‌ఐ సాంబశివరావు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి లారీలో ఇరుక్కుపోయిన అతనిని శ్రమించి అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాదంలో అతని కాళ్లు నుజ్జు అయి అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో అతనిని అంబులెన్స్‌లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి గుంటూరు తరలిస్తుండగా మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న పర్చూరుకు చెందిన కోటేశ్వరమ్మకు తలకు, మండలంలోని పెదజాగర్లమూడికి చెందిన మరో మహిళ సలోమికి ఎదురు సీటు రాడ్ పొడుచుకొని నుదుటిపై తీవ్ర గాయమైంది. వారివురిని పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. మరో ఇరువురు మహిళలకు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కేసు నమోదు చేసుకొన్నట్లు ఏఎస్‌ఐ సాంబశివరావు తెలిపారు.