
నేడు పాఠశాలలకు సెలవు
డీఈఓ పురుషోత్తమ్
బాపట్లటౌన్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో పురుషోత్తమ్ తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు మొత్తం సెలవు అమలు చేయాలన్నారు. శుక్రవారం బాపట్ల పట్టణంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గొనాలన్నారు. మండలాల్లోని విద్యార్థులు ఆయా పాఠశాలలకు హాజరై ఆగష్టు 15 దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ
బాపట్లటౌన్: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపధ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా చప్టాలు, కల్వర్టులపై నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంటే వాటిని దాటి వెళ్లే ప్రయత్నం చేయరాదన్నారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీవర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, జిల్లా ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి కారణంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు భారీగా వరద నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. కాలువలు దాటకుండా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వరద ముంపునకు గురయ్యే అవకాశమున్న ప్రదేశాలలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు పోలీస్ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. తక్షణం పోలీస్ సహాయం అవసరమైతే డయల్ 100/112, స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.
గుంటూరు ఆర్డీగా
డాక్టర్ శోభారాణి
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా డాక్టర్ జి.శోభారాణిని నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి. హోస్‌మణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్‌ఏసీ) ఆర్డీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్డీవోగా పనిచేస్తున్న డాక్టర్ కె.సుచిత్రను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేసి, అక్కడ రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా డాక్టర్ జి.శోభరాణి గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలోని రీజనల్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియలిస్టుగా పనిచేస్తున్నారు. గతంలో డాక్టర్ శోభరాణి గుంటూరు ఆర్డీగా పనిచేశారు.
మూడు రోజుల పాటు మార్కెట్ షాపుల బహిరంగ వేలం
నెహ్రూనగర్ (గుంటూరుఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థ కొల్లి శారద హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ షాపుల బహిరంగ వేలం ఈ నెల 18, 19, 20 తేదీలలో నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరంలో రాష్ట్ర గవర్నర్ పర్యటన, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల వల్ల వాయిదా పడిన షాపుల వేలాన్ని నిబంధనల మేరకు నిర్వహిస్తామన్నారు.
అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం
అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలి రోజు బుధవారం ఉదయం 5గంటల నుంచి ఆలయ ఆవరణను శుద్ధిచేసి భక్తులకు 9 గంటలకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. రెండవరోజు గురువారం పవిత్రో త్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయ ఈఓ రేఖ తెలిపారు.

నేడు పాఠశాలలకు సెలవు