
చైతన్య ఝురి.. క్షీరపురి
చీరాల: బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పన్నులు చెల్లించకుండా చేసిన సహాయ నిరాకరణ ఉద్యమం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. భయపెట్టినా జైలుకు పంపినా మహనీయుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నడిపిన చీరాల–పేరాల ఉద్యమం నేటికీ సంచలనమే. భారత స్వాతంత్య్ర పోరాటంలో చీరాల–పేరాల ఉద్యమం పేరెన్నిక పొందింది. దీనికి సారథ్యం వహించిన దుగ్గిరాల గోపాలకష్ణయ్య అకుంటిత దీక్షతో వాక్‌చాతుర్యంతో పోరాటం చేసి ‘ఆంధ్రరత్న’ బిరుదుతో ప్రజల హృదయాల్లో నిలిచారు. కాంగ్రెస్ ఉద్యమంలో చేరి దేశమాత సేవలో భాగంగా దుగ్గిరాల జాతీయోద్యమంలో పాల్గొంటూ 1919లో చీరాల వచ్చారు. అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం చీరాలను మున్సిపాలిటీగా చేసి అధిక పన్నుల భారాన్ని మోపింది. దీంతో ప్రజలు మున్సిపాలిటీ రద్దును కోరుతూ అప్పటి ఒంగోలు కలెక్టర్ శొంఠి రామ్మూర్తి పంతులు వద్దకు చర్చకు వెళ్లారు. అయితే సబ్ కలెక్టర్ అభిప్రాయాలు దుగ్గిరాలకు నచ్చలేదు. దీంతో గోపాలకృష్ణయ్య ప్రజల్లో జాతీయ భావాలను పెంచేందుకు మున్సిపల్ రద్దుకు శాంతియుతంగా ప్రజల ఉద్యమాన్ని నడిపేందుకు నిర్ణయించారు. ఇందుకోసం శ్రమదాంధ్ర విద్యాపీఠ గోష్టిని ఏర్పాటు చేశారు. దీని ద్వారా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని దుగ్గిరాల భావించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించింది.
రామదండుతో ఉద్యమం ఉధృతం..
ఈ క్రమంలోనే జాతీయోధ్యమాన్ని శాంతియుతంగా నడిపేందుకు దుగ్గిరాల రామదండును ఏర్పాటు చేశారు. రామదండులోని సభ్యులందరూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఈ సమయంలోనే జరిగిన చీరాల మున్సిపల్ ఉద్యమంలో దుగ్గిరాల చురుగ్గా పాల్గొన్నారు. 1921లో మహాత్మాగాంధీ చీరాల వచ్చిన సందర్భంగా తాటాకుపై స్వాగతాన్ని రాసి ఆహ్వానం పలికారు. మున్సిపల్ రద్దుకు గాంధీ సహాయ నిరాకరణ, పుర బహిష్కరణ మార్గాలను సూచించగా దుగ్గిరాల పుర బహిష్కరణానికి పిలుపునిచ్చారు. దుగ్గిరాల నేతృత్వంలో చీరాల–పేరాల ప్రజలు మున్సిపాలిటీని వదిలి దూరంగా పాకలు వేసుకొని జీవనం సాగించారు. చీరాల రామ్‌నగర్‌లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న దుగ్గిరాల అనేక ప్రాంతాలలో పర్యటించి, కాంగ్రెస్ కార్యాలయాలను స్థాపించి జాతీయోద్యమంలో ప్రజలు ఉద్యమించేలా కృషి చేశారు. దుగ్గిరాల వాక్ పటిమను, పోరాటాన్ని గుర్తించిన నాయకులు జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా దుగ్గిరాలను ఎన్నుకున్నారు. ప్లేగు వ్యాధి కారణంగా 1928 జూన్ 10వ తేదిన దుగ్గిరాల మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని చీరాలలో ఊరేగించి రామ్‌నగర్‌లో దహన సంస్కారం చేశారు. అనంతరం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కాంస్య విగ్రహాన్ని పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేశారు.
చీరాల నుంచే ఎన్నో ఉద్యమాలకు పునాది దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ‘చీరాల – పేరాల’ ఉద్యమం బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం నడిపిన ‘దుగ్గిరాల’

చైతన్య ఝురి.. క్షీరపురి