
కార్మికుల సంక్షేమ బాధ్యత అధికారులదే..!
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: కార్మికుల సంక్షేమం, వారి హక్కుల సంరక్షణ బాధ్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాల నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలపై పరిశ్రమల యాజమాన్యం, అనుబంధశాఖల అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. కార్మికుల కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలను కార్మికులందరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులందరిని ఈ–శ్రమ పోర్టల్‌లో చేర్చాలన్నారు. ప్రతి కార్మికుడికి యాజమాన్యాలు పీఎఫ్, ఈఎస్‌ఐలో రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. కార్మికులు శ్రమ దోపిడీకి గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రోజుకు ఎనిమిది గంటలే పనిచేయాలని, వారానికి ఒక సెలవు తప్పనిసరిగా ఉండాలన్నారు. పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలను కార్మికులకు వర్తింపచేయాలన్నారు. వీటిపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ త్రినాథ్, డిప్యూటీ కమిషనర్ గాయత్రిదేవి, సహాయ కార్మిక శాఖ కమిషనర్ వెంకట శివప్రసాద్, సహాయ కార్మిక శాఖ అధికారి వి.సాయిజ్యోతి, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ రామకృష్ణ, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.
ఉపాధి పనులు వేగవంతం చేయాలి..
బాపట్ల: ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. వెంకట మురళి అధికారులకు సూచనలు చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరంలో ‘ఉపాధి’ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల కింద మండలాల్లో మిగిలి ఉన్న 46 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఎంపీడీఓలకు సూచించారు. జాబ్ కార్డుల జారీపై ఆరా తీశారు. దిగువస్థాయి కుటుంబాలను గుర్తించి వారికి జాబ్ కార్డులు ఇవ్వాలన్నారు. జిల్లాలో డెంగీ జ్వరాల వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. గడిచిన రెండు రోజుల్లో కొల్లూరు మండలంలో పెద్దలంక, చింతలలంక గ్రామాల్లో రెండు కేసులు, ఈదుపల్లి, యాజలిలో ఒక్కో కేసు నమోదయిందని వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పీడీ డ్వామా విజయలక్ష్మి, డీపీఓ ప్రభాకర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, పంచాయతీరాజ్ ఈఈ వేణుగోపాల్‌రెడ్డి, బాపట్ల, చీరాల డీఎల్డీఓలు విజయలక్ష్మి, పద్మావతి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ పీఎం మాధవి పాల్గొన్నారు.
పరిశుభ్రతతోనే విద్యార్థులకు ఆరోగ్యం
బాపట్ల: పరిశుభ్రతతోనే విద్యార్థుల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. మంగళవారం స్థానిక డాక్టర్ అంబేడ్కర్ గురుకులం పాఠశాలలో జరిగిన నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండండి...
బాపట్ల: భారీ వర్షాల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. విపత్తు నిర్వహణ, పర్యవేక్షణపై ఆర్డీఓలతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి 2.50 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నందున్న అధికారులు అప్రమత్తం కావాలన్నారు. ఇన్‌చార్జి జేసీ జి.గంగాధర్ గౌడ్, రివర్ కన్సర్వేటర్ కార్యనిర్వాహక ఇంజినీర్ రవికిరణ్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి పాల్గొన్నారు.