
టౌన్ హాల్ @120
ప్రథమాంధ్ర మహా సభలకు వేదిక
బాపట్ల అర్బన్: ఘనమైన చరిత్రకు సజీవ సాక్ష్యం బాపట్ల టౌన్ హాల్. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో మరుపురాని ఘట్టాలకు ఈ టౌన్‌హాల్ వేదికగా నిలిచింది. ఈ భవనం నిర్మించి 120 సంవత్సరాలు పూర్తయింది. 1905 సంవత్సరం జూలై 17న అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ బ్రాడీ ఈ టౌన్ హాలును ప్రారంభించారు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో జాతీయ నాయకులు వివిధ సందర్భాలలో ఈ టౌన్ హాల్ సందర్శించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 1913 మేలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలకు టౌన్‌హాల్ వేదికగా నిలిచింది. ఇంగ్లాండులో పట్టాభిషిక్తుడు అవుతున్న చక్రవర్తి ఎడ్వర్డ్ గౌరవార్థం ఎడ్వర్డ్ పట్టాభిషేక స్మారక టౌన్‌హాల్‌గా దీనికి నామకరణం చేశారు. ఆయన పట్టాభిషేకం రోజునే ఈ టౌన్‌హాల్ నిర్మాణం జరిగింది. 1908లో బాపట్లకు వచ్చిన జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ న్యాపతి సుబ్బారావు పంతులు చొరవతో టౌన్ హాల్లో టెన్నిస్ కోర్టు ప్రారంభమైంది. నిత్యం సాహిత్య, సాంస్కతిక కార్యక్రమాలతో టౌన్ హాల్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ టౌన్ హాల్‌లో న్యూస్ పేపర్ క్లబ్ నిరంతరం పాఠకులకు అందుబాటులో ఉంది.

టౌన్ హాల్ @120