గాలిలో దీపంలా వ్యవసాయం
జె.పంగులూరు: దేశంలో రైతాంగ సంక్షోభానికి, వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలేనని, ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలిలో దీపంగా మార్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం మండలంలోని జనకవరం గ్రామంలో జరిగిన నల్లబర్లీ పొగాకు కౌలు రైతుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. రైతాంగాన్ని ప్రోత్సహించిన ఐటీసీ, జీపీఐ కంపెనీలు నల్ల బర్లీ పొగాకును సాగు చేయించాయన్నారు. అయితే ప్రస్తుతం కంటికి కనిపించకుండా, కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నాయన్నారు. రైతులది అత్యాశ అని వ్యవసాయ శాఖ మంత్రి అనడం సరైంది కాదన్నారు. మూడు నెలల కాలంలో షేర్ మార్కెట్‌లో ఐటీసీ, జీపీఐ షేర్లు నాలుగు శాతం పెరిగాయని, కానీ రైతుల ఆదాయం 40 శాతానికి పడిపోయిందన్నారు. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖమంత్రి చెప్పినా ఇంతవరకు కొన్న దిక్కులేదన్నారు. కౌలు రైతుల కోసం పనిచేస్తామని ప్రగల్భాలు పలికిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడ్రస్ లేడన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య, రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయిణి వినోద్‌బాబు, రైతు సంఘం సీనియర్ నాయకులు కందిమల్ల రామకోటేశ్వరరావు, రైతు పాల్గొన్నారు.
శ్రీనాథ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి
అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న నల్లబర్లీ పొగాకు కౌలు రైతు తల్లపనేని శ్రీనాఽథ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని జనకవరం గ్రామానికి చెందిన నల్లబర్లీ పొగాకు కౌలు రైతు తలనేని శ్రీనాఽథ్ ఈ నెల 24వ తేదీని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం పాఠక విధితమే. దీంతో మృతుని కుటుంబాన్ని శ్రీనివాసరావు శుక్రవారం పరామర్శించారు. ఆయన భార్య వందన, తల్లిదండ్రులు నరసమ్మ, హరిబాబుకు ధైర్యం చెప్పారు.
కంపెనీల చేతుల్లో ప్రభుత్వం ప్రతి ఏటా కంపెనీల లాభాలు పెరుగుదల రైతుల ఆదాయం తగ్గుదల నల్ల బర్లీ పొగాకు కౌలు రైతులు సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు


