కొరిశపాడు రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కొరిశపాడు రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేయాలి

May 28 2025 11:42 AM | Updated on May 28 2025 11:42 AM

కొరిశ

కొరిశపాడు రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి

బాపట్ల: కొరిశపాడు రిజర్వాయర్‌ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకటమురళి అధికారులను ఆదేశించారు. యర్రం చినపోలిరెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల పురోగతిపై మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నుంచి 1.33 టీఎంసీలతో బాపట్లలో 20వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా కొరిశపాడు రిజర్వాయర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిందని, వాటికి సంబంధించిన పనులపై సంబంధిత ఇంజినీర్లను ఆరా తీశారు. రిజర్వాయర్‌ పనులలో మిగిలిన పనులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు కలెక్టర్‌కు వివరించారు. కొరిశపాడు రిజర్వాయర్‌లో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదన పంపామని చెప్పారు. భూ సేకరణకు రూ.6.65 కోట్లు మంజూరు చేశారని ఈఈ చెప్పారు. ఆ మొత్తం ఫీడర్‌ కెనాల్‌ పనులకు అవసరమైన 41 ఎకరాల భూమి కొనుగోలుకు సరిపోతాయని అన్నారు. భూ సేకరణకు సంబంధించిన బకాయి బిల్లుల చెల్లింపునకు సత్వర చర్యలు తీసుకోవాలని గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. రిజర్వాయర్‌ పనుల కోసం ప్రభుత్వం రెండు కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఈ పనులు చేసేందుకు తూర్పుపాలెం, పెద్దూరు గ్రామస్తులు నిరాకరిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ దృష్టికి ఇంజినీర్లు తీసుకువచ్చారు. ఆయా గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి రిజర్వాయర్‌ వలన కలిగే ప్రయోజనాలను వివరించి ఒప్పించాలని కలెక్టర్‌ చీరాల ఆర్డీఓను ఆదేశించారు.

ముంపు ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలి

కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ముంపు ప్రాంత ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకటమురళి అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్‌ ముంపు ప్రాంతాల గురించి జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆరా తీశారు. పూర్తిగా ఒక గ్రామం పాక్షికంగా ఐదు గ్రామాలు ముంపునకు గురయ్యాయని అధికారులు వివరించారు. ముంపు గ్రామ ప్రజలందరూ ఆయా గ్రామాలను ఖాళీ చేసి వారికి కేటాయించిన ప్రదేశానికి తరలి వెళ్లారా లేదా అనే విషయంపై కలెక్టర్‌ ఆరా తీశారు. వారిలో కొంతమంది అదే ప్రాంతంలో ఉన్నారని, మరి కొంతమంది కొత్త ప్రాంతానికి తరలివెళ్లారని అధికారులు చెప్పారు. కొత్త ప్రాంతాలకు తరలి వెళ్లిన ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన భూములపై పూర్తి హక్కు కల్పించే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్‌ కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ప్రత్యేక ఉప కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కందుల ఓబుల్‌ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ప్రాజెక్టు ప్రత్యేక ఉప కలెక్టర్‌ సీహెచ్‌ విజయ జ్యోతికుమారి, చీరాల రెవెన్యూ డివిజన్‌ అధికారి చంద్రశేఖర్‌, గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు జె.శ్రీహరి, ఎం రవి, డీఈలు ఏఈలు పాల్గొన్నారు.

పక్కా గృహాల నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలి

పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి ఆదేశించారు. పక్కా గృహ నిర్మాణాల లక్ష్యాలపై జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో మంగళవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణాలలో పురోగతి కనిపించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్‌ 10వ తేదీన మెగా గృహప్రవేశాల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. బాపట్ల జిల్లాలోనూ నిర్మాణాలు పూర్తిచేసిన వాటిని ప్రారంభించాలన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారులు, ఈఈలు, డీఈలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి

మనిషి దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, యోగా చేయడం వల్ల ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి అన్నారు. మంగళవారం ఉదయం యోగాంధ్ర క్యాంపెయిన్‌లో భాగంగా భావనారాయణస్వామి గుడి ఎదురు రథం బజారులో యోగా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్‌గౌడ్‌, డీఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ విజయమ్మ, పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఇన్‌చార్జి లవన్న, బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి, బాపట్ల తహసీల్దార్‌ సలీమా పాల్గొన్నారు.

కొరిశపాడు రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేయాలి 1
1/1

కొరిశపాడు రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement