పచ్చ దందా.. రేణువైనా మిగులుతుందా?
కొల్లూరు: టీడీపీ నాయకులు ధనార్జనే ధ్యేయంగా తెగిస్తున్నారు. నదిలో భారీ యంత్రాలను వినియోగిస్తూ నేరుగా లారీలకు ఇసుక లోడింగ్ చేస్తూ ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. తమ జేబులు నిండితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా నదీ గర్భాన్ని తోడేస్తూ చట్టాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇసుక అక్రమార్కులు ఆయా అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పడమే దీనికి కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వందల సంఖ్యలో లారీల ద్వారా ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది.
ఏజన్సీలు మారినా అదే తీరు
నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా టీడీపీ నాయకులు వాటిని పాటించడం లేదు. గాజుల్లంక ఇసుక క్వారీలో తొలి నుంచీ అక్రమాలు ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసే పేరుతో అధికారులు రెండు పర్యాయాలు ఏజన్సీలను మార్చినా ప్రయోజనం మాత్రం శూన్యం. అధికారికంగా ఏజన్సీల పేర్లు మారినప్పటికీ వాస్తవానికి పాత వారే బినామీలుగా ఉన్నారనేది బహిరంగ రహస్యంగా మారింది. నదిలో యంత్రాలను వినియోగించకుండా చర్యలు చేపట్టకపోవడానికి ఆ క్వారీ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో అందుతున్న తాయిలాలే ప్రధాన కారణమన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. తాజాగా మండలంలోని గాజుల్లంక–2 క్వారీని త్రిలోక్య ఎంటర్‌ప్రైజస్ ఏజన్సీకి అధికారులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పాత నిర్వాహకులే బినామీగా ఉండటం గమనార్హం.
కూలీలకు ఉపాధి కరవు
గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను విస్మరిస్తూ పచ్చ నాయకులు యంత్రాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల కూలీలకు ఉపాధి లేకుండాపోతోంది. ట్రాక్టర్లలో కూలీల ద్వారా ఇసుక లోడింగ్ చేపట్టి డంపింగ్ యార్డుకు తరలించాలి. అక్కడ అనుమతించిన యంత్రాల సంఖ్యకు మించకుండా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలలోపు లారీలకు లోడింగ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. త్రిలోక్య ఎంటర్‌ప్రైజస్‌కు కేటాయించిన గాజుల్లంక–2 క్వారీలో 4.950 హెక్టార్లలో 31,501 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు కూలీల ద్వారా చేపట్టి, ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించాలి. కానీ లారీలను నదిలోకే దింపి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. వందల మంది కూలీల పొట్టకొట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
హద్దులు దాటుతున్న ఇసుక
లెక్కలు లేకుండా భారీ లారీలలో తరలుతోంది. రోజుకు దాదాపు 200కు పైగా లారీలలో రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు తెలిసింది. అధికారుల తీరుతో నదీ పరివాహక గ్రామాలు తీవ్ర ముప్పు బారిన పడే ప్రమాదం పొంచి ఉందన్న ఆవేదన ప్రజలలో ఉంది. యంత్రాలతో భారీ గోతులు పెడుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ అంశం మైనింగ్ ఏడీ రాజేష్ దృష్టికి తీసుకువెళ్లి వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
ఉచిత ఇసుక మాటున అధికార కూటమి ప్రభుత్వంలోని పచ్చ నేతలు అక్రమ దందాకు తెరలేపారు. నిబంధనలకు నీళ్లొదిలి యథేచ్ఛగా నదిలో భారీ యంత్రాలను వినియోగించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. అందినకాడికి జేబులు నింపుకొంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
ఉచితం మాటున యథేచ్ఛగా
ఇసుక తరలింపు
యంత్రాలతో నదిలో అడ్డగోలుగా
తవ్వకాలు
రేయింబవళ్లు యంత్రాల వినియోగం
స్థానిక కూలీలకు పని లేక ఇబ్బందులు
ఇతర రాష్ట్రాలకు తరలుతున్న
వందల లారీల లోడ్‌లు
అందినకాడికి దండుకుంటున్న
పచ్చ నాయకులు
కనీస చర్యలు కూడా తీసుకోని
అధికారులు
ఏజన్సీ మార్పు పేరిట ఏమార్చి
బినామీల దోపిడీ
పచ్చ దందా.. రేణువైనా మిగులుతుందా?


