
రేషన్ బియ్యం కొనుగోలును ప్రశ్నించిన డీలర్‌పై దాడి
నిందితులపై కేసు నమోదు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్
కొల్లూరు: రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోళ్లు చేపడుతుండటాన్ని నిలదీసి ప్రశ్నించిన రేషన్ డీలర్, సీపీఎం నాయకుడుపై దాడి చేసిన సంఘటన మండలంలోని చింతర్లంకలో చోటుచేసుకుంది. బాధితుడు, సీపీఎం నాయకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చింతర్లంకలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్న తోడేటి సురేష్ శుక్రవారం ఉప్పు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అదే గ్రామంలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తుండటంపై ప్రశ్నించడంతో ఇరువురు నడుమ వాగ్వివాదం చోటుచేసుకంది. ఘర్షణ తీవ్రతరం అవడంతో సురేష్‌పై బియ్యం కొనుగోలు చేస్తున్న ఉప్పు వెంకటేశ్వర్లు అతని కుమారులు దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన సురేష్‌ను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న సురేష్‌ను శనివారం సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.కృష్ణమోహన్, మండల కార్యదర్శి వేములపల్లి వెంకటరామయ్యలు పరామర్శించారు. దాడి జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోళ్లపై ప్రశ్నించినందుకు దాడి చేయడం దారుణమైన విషయమన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై తక్షణం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండలంలో అనేక గ్రామాలలో రేషన్ బియ్యాన్ని కొనుగోళ్లు చేస్తున్న వారిపై మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.