
పేదల నోటికందితే ఒట్టు!
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల కడుపు నిండే పరిస్థితి కూడా లేదు. వారికి అందించే రేషన్ సరకులపై అక్రమార్కుల కన్ను పడింది. కూలీనాలీ చేసుకుని కడుపు నిండితే చాలనుకునే పేద ప్రజల కోసం పౌరసరఫరాల శాఖ అందించే రేషన్ సరకులను కొందరు నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నెల ప్రారంభంలో పేదలు ఎదురు చూసే సరకులు పూర్తిస్థాయిలో అందకపోవటంతో పస్తులుండాల్సి వస్తోంది.
రేపల్లె రూరల్: రేషన్ దుకాణాలలో అందించే వస్తువులను కొంతమంది అక్రమార్కులు అదనపు ధర చెల్లించి డీలర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.130 నుంచి రూ.170 వరకు ఉంది. పంచదార రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణంలో కందిపప్పు కిలో రూ.67, పంచదార అరకిలో రూ.17లకు విక్రయిస్తున్నారు. డీలర్ల నుంచి అక్రమార్కులు బియ్యంతోపాటు కందిపప్పు కూడా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
సక్రమంగా అందని సరకులు
ప్రతి నెల ఏ వస్తువు ఇస్తారో కొనుగోలు చేసే వరకు తెలియని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కేవలం బియ్యం, పంచదారలు మాత్రమే పేదలకు అరకొరగా అందుతున్నాయి. కందిపప్పు, గోధుమ పిండి, బెల్లం, శెనగలు సైతం పంపిణీ చేయాలి. తూకం తక్కువగా ఉందన్న నెపంతో పంచదారను రెండు నెలలపాటు నిలుపుదల చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పంచదార పంపిణీ పునఃప్రారంభించారు. ప్రస్తుతం శ్రీరామనవమికై నా కందిపప్పు ఇస్తారని ఆశగా ఎదురుచూసిన కార్డుదారులకు నిరాశే ఎదురైంది. సరకులు పక్కదారి పట్టడంపై ప్రజాసంఘాల వారు, లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి పాలనలో అస్తవ్యస్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ మూడు నెలలుగా ఆగిపోయిన రేషన్ కందిపప్పు ఎప్పుడు ఏ సరకులిస్తారో కూడా తెలియని వైనం నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకుంటున్న అక్రమార్కులు ప్రభుత్వంపై ప్రజాసంఘాలు, కార్డుదారులు ఆగ్రహం
నిఘా పెంచుతాం
రేషన్ సరకులు నల్లబజారుకు తరలిస్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదు. ఎక్కడైనా ఇలా జరిగితే వివరాలు చెప్పాలని ప్రజలను కోరుతున్నాం. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. రేషన్ దుకాణాలపై నిత్యం నిఘా ఉంచుతాం.
– ఎం.శ్రీనివాసరావు, తహసీల్దార్, రేపల్లె
బోర్డులు ఏర్పాటు చేయాలి
వార్డులకు వచ్చే రేషన్ వాహనాలపై బోర్డులు ఏర్పాటు చేసి కార్డుదారులకు అందించే రేషన్ వివరాలను ప్రదర్శించాలి. గ్రామాలలో నిర్ణీత తేదీలలో ఇచ్చిన విధంగా పట్టణంలోని వార్డులలో కూడా చేయాలి. వాహనాల వద్ద సరకులు తీసుకోని వారికి దుకాణాలలో అందించాలి. అధికారులు నిరంతరం నిఘా ఉంచాలి.
– సి.వి. మోహనరావు, పట్టణాభివృద్ధి సంఘ కార్యదర్శి, రేపల్లె
3 నెలలుగా కందిపప్పు లేదు..
రేపల్లె నియోజకవర్గంలోని కార్డుదారులకు మూడు నెలల నుంచి కందిపప్పు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెండు నెలలు కందిపప్పు నిలుపుదల చేశారు. తరువాత తూతూమంత్రంగా మూడు నెలల పాటు 30శాతం మాత్రమే సరఫరా చేశారు. ఫిబ్రవరి నుంచి కందిపప్పు అందించటం లేదు. నియోజకవర్గంలో 226 రేషన్ దుకాణాల పరిధిలో 68,015 మంది కార్డుదారులు ఉన్నారు.

పేదల నోటికందితే ఒట్టు!

పేదల నోటికందితే ఒట్టు!