సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి 5,6 కిలోమీటర్ల దూరంలోని కాజా టోల్‌గేట్ నుంచి గన్నవరం వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణానికి మట్టి తవ్వి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్దంగా ఈ మట్టిని కొంతమంది వ్యాపారులకు లారీ రూ.2వేలకు అమ్ముతుంటే ఆ వ్యాపారులు లారీ రూ.7వేల నుంచి రూ.8 వేలకు ఇతరులకు అమ్ముకుంటున్నారు. వాస్తవానికి ఈ మట్టిని తరలించేందుకు మైనింగ్‌శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. అయితే సదరు కాంట్రాక్టర్ అవేవీ పట్టించుకోకుండా మట్టిని అమ్ముకోవడం ప్రారంభించారు. ఇదే అదునుగా తీసుకుని కొంతమంది అక్రమార్కులు సైతం రాజధాని ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన రోడ్లను సైతం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. గత ప్రభుత్వం పేదలకు నివాసాలుగా ఇచ్చిన స్థలాల్లో రోడ్లను సైతం కొన్ని చోట్ల తవ్వేశారు. రాత్రిళ్లు ఆ రహదారిపై మట్టిని తవ్వి ఒక ప్రాంతంలో డంపింగ్ చేసి ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసి అమ్ముకుంటున్నారు. అక్రమ మట్టి తవ్వకాల విషయంలో ఈ మధ్యకాలంలో పలు కేసుల్లో నమోదైన ఓ వ్యక్తి ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజధాని గ్రామాలైన కృష్ణాయపాలెం శివారు, వెంకటపాలెం, మందడం శివారు ప్రాంతాల్లో, కొండవీటి వాగు రోడ్డుకు సంబంధించిన మట్టిని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో లారీలు పెట్టి బయటకు తరలిస్తున్నారు. ఐదు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారు పొక్లెయిన్లు తీసుకువచ్చి వారంతట వారే హద్దులు నిర్వహించుకుని మట్టి తవ్వకాలు నిర్వహించి జేబులు నింపుకొంటున్నారు.
నిబంధనలకు నీళ్లు
రాజధానిలో రోడ్లను తవ్వేస్తూ
మట్టి అక్రమ విక్రయాలు
రాజధాని ప్రాంతంలో నిర్వహించే పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లు వదిలి తమ లాభార్జన కోసం పనిచేస్తూ ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారు. దీనికి నిదర్శనం కాజా టోల్ వద్ద నుంచి గన్నవరం వరకు నిర్మించే రహదారిలో కాజా టోల్‌గేట్ వద్ద నుంచి వెంకటపాలెం శివారు వరకు రోడ్డు నిర్మించేటప్పుడు తవ్వే మట్టిని నిబంధనలకు విరుద్దంగా అమ్ముకోవడమే. సదరు కాంట్రాక్టర్లు అవినీతికి దారి చూపడంతో కొంతమంది స్వార్థపరులు రాజధానిలో నిర్మించిన రహదారులను సైతం తవ్వేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రాజధానిలో చేపట్టిన అభివృద్ధి పనులపై నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.