నరసరావుపేట: జిల్లాలో వారబందీ అమలులో ఎండ తీవ్రతకు మిర్చి పంట ఎండిపోతోందని, తక్షణమే సాగునీరు విడుదల చేసి పంటలను రక్షించాలని ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామానికి చెందిన మిర్చి రైతులతో కలిసి నాగార్జునసాగర్ సంతగుడిపాడు సర్కిల్ డీఈ ఎస్.విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ లక్షల రూపాయల పెట్టుబడులు ఒకవైపు, చీడపీడల బెడద మరోవైపు, ధరలు లేమితో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు నీటి కష్టాలు తోడు కావడంతో మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పారు. పంటకు నీరు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. సాగునీటి కోసం ఆందోళన చెందడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గతంలో నాగార్జునసాగర్ జలాశయంలో డెడ్ స్టోరేజ్ ఉన్న సమయంలో కూడా సాగుకు సరిపడా నీరు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను ఏకంచేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంటలు, నీటి అవసరాలపై ఎన్‌ఎస్పీ అధికారుల దగ్గర వివరాలు లేకపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని తెలిపారు. ప్రస్తుతం సాగులో ఉన్న మిర్చి, మొక్కజొన్న, దాళ్వా వరి, ఇతర కూరగాయ పంటలు దెబ్బ తినకుండా ఏప్రిల్ 20 వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన డీఈ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని, తక్షణమే నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.
ఎన్‌ఎస్పీ డీఈని కలిసి వినతిపత్రం అందజేత