నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని 24 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, 11వ తరగతి (ఇంటర్మీడియెట్) ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ టి.వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. 7,8, 9, 10,12వ తరగతుల్లోనూ మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తులను https//apkgbv.apcfss.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. వివరాలకు 97041 00406, 94406 42122 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
చర్లపల్లి–కన్యాకుమారి మధ్య సమ్మర్ వారాంతపు ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్థం సమ్మర్ వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి–కన్యాకుమారి వయా గుంటూరు డివిజన్ మీదుగా ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వ తేదీ వరకు ప్రత్యేక రైలు(07230) ప్రతి బుధవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు చర్లపల్లి స్టేషన్ నుంచి రాత్రి 9.50 గంటలకు బయలుదేరి రెండో రోజు అర్ధరాత్రి 2.30 గంటలకు కన్యాకుమారి స్టేషన్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. అలాగే కన్యాకుమారి–చర్లపల్లి రైలు(07229) ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు కన్యాకుమారి స్టేషన్ నుంచి తెల్లవారు జామున 5.15 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.40 గంటలకు చర్లపల్లి స్టేషన్‌కు చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.
జయ గోవర్ధనా.. నారసింహా
మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం స్వామి గోవర్ధనోద్ధరణ అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శెనగల రామహనుమాన్, శేషాంజనేయ గోపాల్‌లు వ్యవహరించారు. ఆస్థాన కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు వ్యవహరించారు. శుక్రవారం స్వామి గజేంద్రమోక్షం అలంకారంలో దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు.
స్థానిక సంస్థల్లో ఖాళీలకు
27న ఉప ఎన్నికలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు ఈనెల 27న ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీలను పరోక్ష విధానంలో ఎన్నికల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 27న ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరించిన అనంతరం మధ్యాహ్ననికి ఎన్నిక, ప్రమాణ స్వీకారంతో ప్రక్రియ ముగియనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ద్వారా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షులు, గుంటూరు రూరల్ మండల పరిషత్ ఉపాధ్యక్ష స్థానంతో పాటు తెనాలి మండల నుంచి కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌ల స్థానాల వారీగా కొల్లిపర మండలం తూములూరు, చక్రాయపాలెం, మేడికొండూరు మండలం గుండ్లపాలెం, మేడికొండూరు, దుగ్గిరాల మండలం మంచికలపూడి, ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం, పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం, పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు, చేబ్రోలు మండలం శ్రీరంగాపురంలో ఎన్నికలు జరగనున్నాయి.