● అర్జీదారులకు అన్నదానం ● జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి
బాపట్లటౌన్ : జిల్లా నలుమూలల నుంచి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కార్యాలయానికి వచ్చే బాధితులకు అన్నదానం చేయటం సంతృప్తికరంగా ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల్లో సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చే అర్జీదారులకు జిల్లా కలెక్టర్ సోమవారం భోజన సౌకర్యాలను కల్పించారు. ప్రజా సమస్యలపై సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సమస్యలను చూసి అక్షయ పాత్ర ఆధ్వర్యంలో భోజనం తయారు చేయించి అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యాలను చేరుకోవాలి
ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని మిర్చిపంటలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. జిల్లాలో విద్యాశాఖ, రోడ్లు, భవనాలు, ఐటీఐ, మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపాల్టీలో చెత్త నిర్వహణ, వైద్య విధాన పరిషత్ శాఖల పనితీరు సరిగా లేదన్నారు. ఆయా శాఖల అధికారులు పనితీరు మార్చుకోవాలన్నారు.
సర్వే పారదర్శకంగా చేయాలి
గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహించే పలు సర్వేలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా త్వరితగతిన పూర్తిచేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. సచివాలయాల్లోని సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయడంలో జిల్లా వెనుకబడి ఉందని, ఏప్రిల్ మాసం నుంచి బయోమెట్రిక్ ఆధారంగానే జీతభత్యాల చెల్లింపులు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జేసీ ప్రఖర్‌జైన్, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు.
నాటుసారానూ పూర్తిగా నిర్మూలించాలి
నాటుసారాను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నవోదయం 2.0 పోస్టర్లను ఆవిష్కరించారు.