
టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
● అదనపు ప్రధాన ఎన్నికల అధికారికి వినతి ● వికలాంగుల హక్కుల సమితి అధ్యక్షుడు కాలేషా
చీరాల టౌన్: దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ చీరాల అభ్యర్థి ఎంఎం కొండయ్యపై చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి పి.కోటేశ్వరరావుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. కాలేషా మాట్లాడుతూ కొండయ్య దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడి, ఎన్నికల సంఘం నిబంధనలను విస్మరించారన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్భాషలాడిన వీడియో పుటేజీలు అందించి, ఈసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దివ్యాంగులను అవ హేళన చేస్తూ మాట్లాడిన వీడియో పుటేజీ కూడా అందించామని తెలిపారు. జాతీయ దివ్యాంగుల చట్టం 2016 సెక్షన్ 92ఏ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కొండయ్య మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను అందించి చీరాల ఆర్వో, డీఎస్పీకి ఫిర్యాదులు చేసినా.. ఎఫ్‌ఐఆర్ కాపీలు అందించినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దూపాటి రమణయ్య, బత్తుల సాయికుమార్, రాజేంద్ర ఉన్నారు.