
పోస్టర్ ఆవిష్కరిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా, జేసీ రాజకుమారి తదితరులు
నెహ్రూనగర్: వైకల్యం ఏదైనా కూడా శరీరానికే కాని, మనసుకు కాదని జిల్లా జాయింట్ కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు ఏదైనా సాధించగలమనే దృఢ సంకల్పం కలిగి, అందరికీ స్ఫూర్తినిస్తున్న దివ్యాంగులకు చేయూతనిచ్చి, ఆసరాగా నిలిచి వారిని గౌరవించాలని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా , రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహాయ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ముంతాజ్ పఠాన్‌తో కలసి జాయింట్ కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో జేసీ మాట్లాడుతూ జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి పది చొప్పున రూ. 65 లక్షల విలువ చేసే 70 మూడు చక్రాల స్కూటర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా చిరు వ్యాపారం, ఇంటిలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్, టెంట్ హౌస్ గానీ ఏర్పాటు చేసుకుంటే జిల్లా యంత్రాంగం ఎంప్లాయి ష్యూరిటీ ఇప్పించి లోన్ మంజూరు చేయిస్తుందని, దీన్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. విభిన్న ప్రతిభావంతుల్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యా, వైద్యం, సంక్షేమం, ఉపాధి కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ కత్తెర క్రిస్టినా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన వారి తల్లిదండ్రులు, అవ్వా తాతలు, ట్రైనింగ్ ఇస్తున్న టీచర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహాయ కార్పొరేషన్ చైర్ పర్సన్ ముంతాజ్ పఠాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న ప్రతిభావంతులు చాలా ప్రతిభ కలిగి ఉన్నారని, ఉద్యోగాల్లో, ఆటల పోటీలలో, సేవా కార్యక్రమాల్లో కూడా రాణిస్తున్నారని తెలిపారు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త మాట్లాడుతూ జిల్లాలో 24,988 మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సభా కార్యక్రమం అనంతరం దివ్యాంగ బాలబాలికల పోటీల్ని జెండా ఊపి ప్రారంభించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 , దివ్యాంగుల హక్కుల చట్టం 2016పై రూపొందించిన పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో డెప్యూటీ కలెక్టర్ కె. స్వాతి , సమగ్ర శిక్ష ఏపీడీ విజయలక్ష్మి, నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ సజీల, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పరమేశ్వరరెడ్డి , విభిన్న ప్రతిభావంతుల సంఘాల జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ జి. రాజకుమారి ఘనంగా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం