కుటుంబానికి ఆసరా దొరికింది | Sakshi
Sakshi News home page

కుటుంబానికి ఆసరా దొరికింది

Published Sun, Mar 31 2024 5:18 AM

Jagan Mohan Reddy is implementing the Navaratnalu scheme in AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

కుటుంబానికి ఆసరా దొరికింది
నేను, నా భర్త సుధాకర్‌తో కలిసి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు సునీల్‌శర్మ పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. మాది ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం. కూలినాలి చేసుకుని బతుకుతున్న తరుణంలో 2018లో నా భర్త ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆస్పత్రిలో చూపిస్తే కిడ్నీ పాడైందని డాక్టర్లు చెప్పారు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలని దిగులుపడిన తరుణంలో 2019లో ముఖ్యమంత్రి జగనన్న కిడ్నీ బాధితులకు బాసటగా నిలిచారు.

ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కిడ్నీ ఆపరేషన్‌ చేయించారు. ప్రతి నెలా పింఛన్‌ రూ.5 వేలు మంజూరు చేశారు. పెద్ద కుమారుడికి దివ్యాంగ పింఛన్‌ రూ.3 వేలు ఇస్తున్నారు. నాకు వైఎస్సార్‌ చేయూత ద్వారా ఏటా రూ.18,750 అందుతోంది. వైఎస్సార్‌ ఆసరా పథకం వర్తించింది. మా అమ్మాయికి వివాహం చేశాను. చిన్నబ్బాయి అనిల్‌వర్మకు ఏటా అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15 వేలు అందింది. ఈ రోజు మా జీవితం బాగుండటానికి కారణమైన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.    – కందుల ఎలీశమ్మ, చినమనగుండం    (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల)

నా గుండె చప్పుడు సీఎం జగన్‌
నేను గుంటూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నా. మేము వెల్దుర్తి ఎస్సీకాలనీలో నివసిస్తున్నాం. ఆదాయం అంతంత మాత్రమే. వచ్చిన ఆదాయంతోనే ఎలా­గోలా జీవిస్తున్న తరుణంలో అనుకోకుండా గుండెకు సంబంధించిన సమస్య తలెత్తింది. హైదరాబాద్‌లో వైద్యులను సంప్రదిస్తే గుండె మార్పిడి ఆపరేషన్‌ చేయాలన్నారు. సుమారు రూ.33 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. అంతంత మాత్రం జీతంతో జీవిస్తున్న మాకు అంత డబ్బు ఎలా తేవాలో అర్థం కాలేదు. ఇక బతుకుపై ఆశ సన్నగిల్లింది. అప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాం.

ఏంచేయాలో పాలుపోలేదు. నా సమస్యను ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెప్పాను. ఆయన ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో నాకు ప్రత్యేకంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.33 లక్షలు మంజూరు చేశారు. ఐదు నెలల క్రితం తిరుపతి స్విమ్స్‌ వైద్యశాలలో డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో నాకు ఆపరేషన్‌ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ కావటంతో అతడి గుండెను నాకు అమర్చారు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. సీఎం జగన్‌ నాకు పునర్జన్మ ప్రసాదించారు. నా కుమారుడికి అమ్మఒడి కింద ఏడాదికి రూ.15 వేలు వంతున వస్తోంది. ప్రభుత్వం మా గ్రామంలోని జగనన్న కాలనీలో మాకు ఇంటి స్థలం కూడా మంజూరు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంతోషంగా జీవిస్తున్నాం. నా గుండె చప్పుడుగా మారిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.   – చాగంటి సుమతి, వెల్దుర్తి(డి.వెంకటేశ్వర్లు, విలేకరి, వెల్దుర్తి)

మమ్మల్ని దేవుడిలా ఆదుకున్నారు
మాది నిరుపేద కుటుంబం. మా ఆయన గోవిందరావు రోజువారీ కూలీ. ఆయన అరకొర సంపాదనతోనే మా జీవితం సాగుతోంది. నేను దివ్యాంగురాలిని కావడంతో ఏ పనీ చేయలేను. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం 30వ డివిజన్‌లోని రామకృష్ణాపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాం. మాకు వైష్ణవి అనే కూతురు ఉంది. ప్రస్తుతం 4వ తరగతి చదువుతోంది. గత ప్రభుత్వం మాలాంటి వారికి ఎలాంటి సాయం చేయలేదు. ఇటీవల నాకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చూపించుకుంటే పరీక్షలు చేసిన డాక్టర్లు క్యాన్సర్‌గా నిర్ధారించారు.

ఏం చేయాలో పాలుపోలేదు. అయితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పడంతో దాని ద్వారా శస్త్రచికిత్స చేయించుకున్నా. ఇప్పడు ఆరోగ్యంగా ఉన్నా. జగనన్న ప్రభుత్వం శస్త్రచికిత్స సమయంలో రూ.పది వేలు సాయం అందించింది. కీమో థెరపీ సమయంలోనూ రూ.ఐదు వేల చొప్పున అందిస్తున్నారు. దివ్యాంగురాలినైన నాకు పింఛను వస్తోంది. మా పాపకు మూడేళ్లుగా అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వంతున వచ్చాయి. ఇంటి పట్టా కూడా మంజూరైంది. ఎటువంటి ఆసరా లేని మమ్మల్ని జగనన్న దేవుడిలా ఆదుకున్నారు. జగనన్నకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. – కుంటిమద్ది సుజాత, రామకృష్ణాపురం, విజయవాడ (సిద్దుబల్ల రాజేంద్రప్రసాద్, విలేకరి, పూర్ణానందంపేట)

Advertisement
Advertisement