బ్రహ్మంగారిమఠం... దేదీప్యమానం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మంగారిమఠం... దేదీప్యమానం

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధకులు జగద్గురు శ్రీ మద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాముల వారి 418వ జయంత్యుత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగాయి. ఆఖరి రోజైన ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్తీక సహస్ర దీపార్చన కార్యక్రమంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి, భక్తిపారవశ్యంతో దీపాలను వెలిగించారు. వేలాది దీపాల కాంతులతో బ్రహ్మంగారిమఠం పరిసరాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోయాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల ‘గోవిందా.. వీరబ్రహ్మేంద్రాయ నమః’ అనే నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారికి మఠాధిపతులు శ్రీ వీరధర్మజ వేంకటాద్రిస్వామి, ఉమాదేవి దంపతులు విశేష పూజలు చేశారు.

శాస్త్రోక్తంగా పూర్ణాహుతి

తెల్లవారుజామున సుప్రభాత సేవ, వేదస్వస్తి పారాయణం నిర్వహించారు. ఉదయం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి మండల పూజలు, విశేష హోమాలు, ఆవాహనాది సమస్త దేవతా హోమాలు, శాంతి హోమం చేశారు. వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం నైవేద్యం, మహామంత్రపుష్పం, మంగళహారతి చేపట్టారు. గరుడాలయ సంప్రోక్షణ, విశేషార్చన, ప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉభయ దాతలు రిటైర్డ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ చెరుకూరు బాలబ్రహ్మాచారి, సావిత్రమ్మ దంపతులు, స్మార్తాగమ వాస్తు జ్యోతిష పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, లక్ష్మీనాగసుధ, వారి కుటుంబ సభ్యులకు మఠం మేనేజర్‌ పీపీఎన్‌ ప్రసాద్‌ శేష వస్త్రాలు అందించి సన్మానించారు. ఉత్సవాలను పురస్కరించుకుని క్షేత్రాన్ని రంగురంగుల పూలు, విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి సోదరుడు దత్తాత్రేయస్వామి, రాధాదేవి దంపతులు, మఠం మేనేజర్‌ పీపీఎన్‌ ప్రసాద్‌ దంపతులు, మఠం సిద్ధాంతులు, అర్చకులు, మైదుకూరు న్యాయవాదులు జేకే చారి, మూలే నాగిరెడ్డి, కామనూరు శ్రీనివాసులు, స్వామి వారి శిష్యులు, పుర ప్రజలు పాల్గొన్నారు.

వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి

జయంత్యుత్సవాలు

కనుల పండువగా సహస్ర దీపార్చన

తరలివచ్చిన భక్తజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement