గండికోటలో విద్యార్థుల సాహస విన్యాసాలు | - | Sakshi
Sakshi News home page

గండికోటలో విద్యార్థుల సాహస విన్యాసాలు

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

గండికోటలో విద్యార్థుల సాహస విన్యాసాలు

● విజయవంతంగా ముగిసిన శిక్షణ శిబిరం

మదనపల్లి సిటీ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ, వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన మూడు రోజుల సాహస క్రీడల శిక్షణ శిబిరం ఆదివారం విజయవంతంగా ముగిసింది. సమగ్ర శిక్ష (ఆంధ్రప్రదేశ్‌) సహకారంతో అడ్వెంచర్స్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్‌ 20 నుంచి గండికోట వేదికగా ఈ వినూత్న శిబిరాన్ని నిర్వహించారు. ప్రకృతి ఒడిలో జరిగిన ఈ సాహస యాత్ర విద్యార్థులకు సరికొత్త అనుభూతిని పంచింది. అన్నమయ్య జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 8, 9 తరగతుల 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా క్యాంపింగ్‌, టెంట్‌ ఏర్పాటు, ప్రాథమిక ప్రథమ చికిత్స, భద్రతా నియమాలు, సాహస క్రీడలు, టీమ్‌ ఛాలెంజ్‌ కార్యక్రమాల్లో ప్రత్యక్ష అనుభవం పొందారు. వివిధ మండలాల విద్యార్థులు బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో సవాళ్లను అధిగమించారు. తద్వారా జట్టు స్ఫూర్తి, క్రమశిక్షణ, స్వావలంబన, నాయకత్వ లక్షణాలను అలవరచుకున్నారు. ముఖ్యంగా భయాన్ని అధిగమించి కొత్త సాహస కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. మూడు రోజుల పాటు విద్యార్థులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించడంతోపాటు శిక్షణ పొందిన బోధకుల పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలను భద్రతా ప్రమాణాలతో నిర్వహించారు. శిబిరం ముగింపు సందర్భంగా కోర్సు పూర్తి చేసిన 60 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కొత్త అనుభవాలు, స్నేహాలు, సాహస శిక్షణ తమలో ఎంతో ధైర్యాన్ని నింపాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement