సాక్షి, మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నారు. కౌన్సిల్ హాలులో చైర్మన్ శ్రీరామకుమార్, 48 మంది కౌన్సిలర్ల చేత ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం వైస్‌చైర్మన్ ఎన్నిక జరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగా కౌన్సిల్ హాలు, ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
● కానిస్టేబుల్‌కు గాయాలు
పెద్దతిప్పసముద్రం : స్థానిక పోలీస్ స్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రాఘవ ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విధి నిర్వహణ అనంతరం ఆయన ద్విచక్ర వాహనంలో మండల కేంద్రం నుంచి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతుండగా.. బి.కొత్తకోట రోడ్డులోని టి.సదుం క్రాస్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా జింక రావడంతో వాహనం అదుపు తప్పి ఫల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రాఘవకు చేతులు, మోకాలు భాగంలో రక్త గాయాలు అయ్యాయి. తలకు హెల్మెట్ ఉండటంతో ప్రమాదం తప్పిందని తోటి పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ రోడ్డులో జింకల సంచారం కారణంగా ఎంతో మంది వాహనదారులు గాయపడిన విషయం పాఠకులకు తెలిసిందే.
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో ఉన్న వూటుకూరు వీరయ్య ప్రభుత్వ కో–ఎడ్యుకేషన్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరసింహారెడ్డి ఈ ఏడాది ఈనెల 13న విద్యార్థినిని స్టాఫ్ రూమ్‌కు రావాలని సూచించడంతో మధ్యాహ్నం తన స్నేహితురాలితో కలిసి స్టాఫ్ రూమ్‌కు వెళ్లిన విద్యార్థిని.. ఉపాధ్యాయుడు నిద్రపోతుండటంతో తిరిగి తరగతి గదికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరోసారి ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లగా, తన స్నేహితురాలిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఉపాధ్యాయుడు పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన విద్యార్థిని ఉపాధ్యాయుడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఏడుస్తూ, అక్కడే ఉన్న మరో గురువు ఫోన్ ద్వారా తన పిన్నికి సమాచారం తెలిపింది. అనంతరం విద్యార్థిని పిన్ని పాఠశాలకు చేరుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. బంధువులతో చర్చించిన తర్వాత పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ఉపాధ్యాయుడు నరసింహారెడ్డిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


