● సహకార సభ్యుల వివరాలు సేకరణ
● పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు కసరత్తు
మదనపల్లి (కురబలకోట): గ్రామీణ రాజకీయాల్లో మరోసారి సహకార ఎన్నికల సందడి మొదలు కానుంది. సహకార ఎన్నికలు జనవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు సన్నద్ధమవుతోంది. జిల్లాలోని 25 మండలాల్లో 29 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సింగిల్ విండోలు) ఉన్నాయి. వీటి పరిధిలో 62,741 వేల మంది దాకా సభ్యులు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు అన్ని ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవసరమైన ఓటరు లిస్టు తయారీ, పోలింగ్ కేంద్రాల తదితర వాటిపై దృష్టి సారించారు
ఈకేవైసీ ఉంటేనే ఓటు హక్కు
ఈసారి సహకార ఎన్నికల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డూప్లికేట్ ఓటర్లకు చెక్ పెడుతున్నారు. అంతేగాకుండా మునుపటిలా కాకుండా ఈసారి ప్రతి ఓటరుకు ఈకేవైసీ తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఓటరు విధిగా ఆయా సింగిల్ విండోలలో ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల డూప్లికేట్ ఓటర్లకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. అదే విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే డీపాల్టర్‌గా కూడా ఉండకూడదు. కొత్త ఓటర్లకు అవకాశం ఉన్నా వారు విండోలో రుణం తీసుకుని ఉండాలి.
ముమ్మరంగా ఏర్పాట్లు
ఎన్నికలను పకడ్బందీగా పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు ముందస్తుగా ప్రాథమిక చర్యలు చేపడుతున్నాం. సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 29 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలతో సమగ్ర ఏర్పాట్లు చేపట్టాం. ఇందులో భాగంగా సహకార సభ్యులు వివరాల సేకరణ, ఈకేవైసీ నమోదు, ఓటర్ల జాబితా రూపకల్పన, నియోజక వర్గాల నిర్దారణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎన్నికల సామాగ్రి సమకూర్చడం, సిబ్బందికి శిక్షణ చర్యలను ముమ్మరంగా చేపడుతున్నాం
– సి. గురుప్రకాష్, జిల్లా సహకార శాఖ అధికారి (డీసీఓ), మదనపల్లి, అన్నమయ్య జిల్లా


