రాళ్లతో అరాచకం.. ఓట్లతో అథఃపాతాళం! | - | Sakshi
Sakshi News home page

రాళ్లతో అరాచకం.. ఓట్లతో అథఃపాతాళం!

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

రాళ్లతో భయపెట్టాలనుకున్నారు..

ఓట్లతో ఉక్కిరిబిక్కిరయ్యారు..

ఆయుధాలుగా విసిరిన రాళ్లు గాలిలో

కలిసిపోయాయి.. కానీ, ప్రజలు వేసిన ఓట్లు మాత్రం చరిత్రలో నిలిచిపోయే తీర్పునిచ్చాయి. అధికారం అండతో

సాగించిన అరాచకానికి తంబళ్లపల్లె గడ్డపై ప్రజాస్వామ్యం గట్టి గుణపాఠం చెప్పింది. దౌర్జన్యంతో గెలవాలనుకున్న తెలుగుదేశం పార్టీకి, ఓటర్లు తమ తీర్పుతో కోలుకోలేని పరాభవాన్ని రుచి చూపించారు.

సాక్షి, మదనపల్లె : తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాళ్ల దాడితో అరాచకం సృష్టించిన తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు కోలుకోలేని దెబ్బకొట్టారు. ప్రజా మద్దతు లేకపోవడంతో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. గతంలో జరిగిన ఏ స్థానిక ఎన్నికల్లోనూ లేని విధంగా, ఈ దఫా పెద్దమండ్యం, తంబళ్లపల్లె మండలాల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది.

అధికార మదంతో దౌర్జన్యం..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా గత నెల 22న పెద్దమండ్యం, తంబళ్లపల్లె మండలాల్లో కూటమి శ్రేణులు రెచ్చిపోయాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అసలు పోటీలోనే లేకుండా చేయాలనే కుట్రతో, నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వారిపై రాళ్ల వర్షం కురిపించి భయానక వాతావరణం సృష్టించారు. ఈ రెండు మండలాల ఎన్నికల చరిత్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. అధికార బలంతో సాగించిన ఈ అరాచకాలపై ఆగ్రహించిన ప్రజలు, ఓటు అనే ఆయుధంతో టీడీపీకి గట్టి గుణపాఠం చెప్పారు.

పెద్దమండ్యంలో టీడీపీ ‘జీరో’

పెద్దమండ్యం మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగగా.. వైఎస్సార్‌సీపీతో పాటు కూటమి పార్టీల అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేశారు. అయితే, ఓటర్లు టీడీపీని పూర్తిగా తిరస్కరించారు. పోటీ చేసిన 9 స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలై, మండలంలో కనీసం బోణి కూడా కొట్టలేకపోయారు. బీజేపీ నేత చల్లపల్లి నరసింహారెడ్డి స్వగ్రామం మందలవారిపల్లెలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కేవలం 9 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. మిగిలిన 9 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకపక్షంగా కై వసం చేసుకుంది. వీటిలో ఆరు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు 1,000 నుండి 1,600 ఓట్ల వరకు లభించడం విశేషం. మండల పరిషత్‌ ఎన్నికల చరిత్రలో టీడీపీకి తొలిసారిగా ఇంతటి ఘోర అవమానం దక్కింది.

తంబళ్లపల్లెలో ఒక్కటే..

తంబళ్లపల్లె మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ, కూటమి అభ్యర్థులు తలపడ్డారు. ఇక్కడ కూడా టీడీపీకి తీరని పరాభవమే ఎదురైంది. 9 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయదుందుభి మోగించగా, టీడీపీ కేవలం గోపిదిన్నె ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కన్నెమడుగు ఎంపీటీసీ స్థానంలో పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దేవరింటి లీలావతికి మండలంలోనే అత్యధికంగా 1,846 ఓట్లు పోలయ్యాయి. ఆమె 1,082 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. తంబళ్లపల్లె మండల చరిత్రలో టీడీపీ ఇంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఇదే మొదటిసారి.

టీడీపీ వర్గాల్లో అంతర్మథనం

తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో ఎదురైన ఈ దారుణ ఓటమి టీడీపీ జిల్లా నాయకత్వంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ లేని విధంగా ఇంతటి పరాభవం ఎదురుకావడానికి గల కారణాలపై పార్టీ నేతలు సమీక్షించుకుంటున్నట్లు తెలిసింది. నామినేషన్ల రోజున సాగించిన రాళ్ల దాడి, అరాచక ఘటనలే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయా? అనే కోణంలో పార్టీ వర్గాల్లో అంతర్మథనం మొదలైంది.

రెండు మండలాల్లో

టీడీపీకి దిమ్మతిరిగే షాక్‌

పెద్దమండ్యంలో ఖాతా కూడా తెరవలేదు

తంబళ్లపల్లెలో కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానానికే పరిమితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement