● చేతికిరాని నిధులు.. చేతులెత్తేస్తున్న పంచాయతీ కార్యదర్శులు
● ఎంపీటీసీ ఎన్నికల బాకీలే తీరలేదు..
● మళ్లీ సర్పంచ్ ఎన్నికల భారం ఎట్లా?
రాజంపేట : ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్న సామెత ఇప్పుడు జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సరిగ్గా సరిపోతోంది. ఒకవైపు విధుల ఒత్తిడి, మరోవైపు త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు కార్యదర్శులను పట్టిపీడిస్తున్నాయి.
మండల పరిషత్ ఎన్నికల నాటి నుంచి నేటి వరకు ఎన్నికల నిర్వహణ వ్యయం భరించలేక వారు కాసుల కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 39 మండలాల్లోని 615 గ్రామ పంచాయతీలు, 5,960 వార్డులకు గాను మొత్తం 6,136 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 13న తొలి నోటిఫికేషన్ విడుదల కానుండటంతో, నామినేషన్ల పర్వం నుంచి పోలింగ్ ముగిసే వరకు స్థానికంగా ఎన్నికల నిర్వహణ భారమంతా కార్యదర్శులపైనే పడనుంది. ప్రభుత్వ నిధులు సకాలంలో అందకపోవడంతో సొంత డబ్బులు పెట్టలేక, అప్పులు చేయలేక కార్యదర్శులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎంపీడీఓల నుంచి కాసులేవీ..?
గత ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌ల నిర్వహణ కోసం చేసిన అప్పులు ఇప్పటికీ తీరకపోవడం కార్యదర్శులను కలవరపెడుతోంది. షామియానా, హోటల్, స్టేషనరీ తదితర వ్యాపారులు బకాయిలు చెల్లించాలని కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాగానే ఇస్తామని చెబుతూ వారు కాలం వెళ్లదీస్తున్నారు. కొన్ని చోట్ల ఎంపీడీఓ కార్యాలయాల్లో అరకొరగా కేవలం రూ.1,000 ఇస్తుండటంతో, ఆ మొత్తాన్ని తీసుకోవడానికి ఇష్టపడక కార్యదర్శులు వెనక్కి వచ్చేస్తున్నారు. మరికొన్ని చోట్ల చేతి చమురు వదులుతోంది. ప్రభుత్వమే నేరుగా నిధులు ఇవ్వనప్పుడు ఎన్నికల నిర్వహణ బాధ్యత తమపై ఎందుకు వేయాలని, తమ్ము అప్పులపాలు చేయడం ఎంతవరకు న్యాయమని కార్యదర్శులు మండిపడుతున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక్కో కార్యదర్శి సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు సొంతంగా ఖర్చు చేశారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు ఆ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల భారం!
పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన బాధ్యత అంతా స్థానిక పంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. బారికేడ్ల ఏర్పాటు, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, తాగునీరు, పోలింగ్ సిబ్బందికి భోజన వసతులు.. ఇలా ప్రతి ఒక్కటీ కార్యదర్శే చూసుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి ఈ ఖర్చుల కోసం ప్రభుత్వం ఎంపీడీఓల ద్వారా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే, కొంతమంది ఎంపీడీఓలు ఇందులో చేతివాటం ప్రదర్శిస్తున్నారని, మరికొందరు అరకొర నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కార్యదర్శి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని వారు గుర్తుచేస్తున్నారు.
సర్పంచ్ ఎన్నికలు.. ‘ఎలా రామా?’
సర్పంచ్ ఎన్నికల ఏర్పాట్లకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని కార్యదర్శులు లబోదిబోమంటున్నారు. ఎంపీటీసీ ఎన్నికలతో పోలిస్తే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పోలింగ్ బూత్‌ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పోలింగ్ సిబ్బంది సంఖ్య పెరిగి, ఏర్పాట్ల వ్యయం కూడా రెట్టింపు అవుతుంది. గత ఎన్నికల కష్టాలే ఇంకా తీరకముందే, మళ్లీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కాసుల కోసం నానాపాట్లు పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. అసలు ఎన్నికల నిధులు ఏమవుతున్నాయని, కార్యదర్శులకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకు నిలిపివేశారని సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
నాయకులను ఆశ్రయిస్తున్న వైనం..
ఎన్నికల నిర్వహణ భారం మోయలేక చాలా చోట్ల కార్యదర్శులు స్థానిక రాజకీయ నాయకులను ఆర్థిక సాయం కోసం ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక్కో పోలింగ్ బూత్ ఏర్పాటుకు కనీసం రూ.10 వేలకు పైగా వ్యయం అవుతోంది. ఎంపీడీఓల ద్వారా ఎన్నికల నిధులు పూర్తి స్థాయిలో నేరుగా కార్యదర్శుల చేతికే అందితేనే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


