ముహూర్తం ఖరారు ! | - | Sakshi
Sakshi News home page

ముహూర్తం ఖరారు !

Nov 11 2026 3:33 AM | Updated on Nov 11 2026 3:33 AM

సాక్షి, మదనపల్లె: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులతో ఈనెల 19, 20వ తేదీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా పరిషత్‌ సభ్యులు జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కో ఆప్షన్‌ నెంబర్‌ను ఎన్నుకోవాలి. మండల ప్రజా ప్రరిషత్‌ ప్రాదేశిక సభ్యులు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాలి. దీనికోసం ఈనెల 19న జిల్లాలోని 25 ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోజు తొలుత ఎంపీపీ పదవికి బరిలో నిలిచిన వారిని ప్రకటిస్తారు. అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించి కో–ఆప్షన్‌ సభ్యున్ని ఎన్నుకున్నాక, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులకు ఎన్నిక పూర్తిచేస్తారు. అలాగే 20న ఎన్నికై న 25 మంది జెడ్పీటీసీలతో మదనపల్లె జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అదే రోజు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికల అధికారి నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడిని ఎన్నుకుంటారు. తర్వాత జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు నిర్వహించి ప్రక్రియను పూర్తి చేస్తారు.

జిల్లా పరిషత్‌ టీడీపీదే

జిల్లాలో 25 జెడ్పీటీసీల్లో టీడీపీకి 19 దక్కాయి. వీటిలో మూడు జెడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకోగా..మిగిలిన వాటిని ఎన్నికల్లో అధికారం అండతో గెలుచుకున్నారు. దాంతో మెజార్టీ దక్కడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కోఆప్షన్‌ సభ్యుని పదవులు టీడీపీకే దక్కుతాయి. 25 మండలాల్లో 21 మండలాల్లో కూటమి పార్టీలకే మెజార్టీ ఎంపీటీసీ స్థానాల్లో దక్కాయి. దీంతో కూటమికే ఆ మండలాల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులు దక్కనున్నాయి.

వైఎస్సార్‌సీపీకి నాలుగు

జిల్లాలో తంబళ్లపల్లి, పెద్దమండ్యం, నిమ్మనపల్లి, సదుం మండలాల్లో వైఎస్సార్‌సీపీ మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. దీంతో ఈ నాలుగు మండలాల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ పదవులు ఆ పార్టీకే దక్కుతాయి.

రామసముద్రంలో ఎన్నిక ఆసక్తికరం

రామసముద్రం ఎంపీపీ ఎన్నిక విషయంలో ఆసక్తికర పరిణామం జరగనుంది. ఈ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వైఎస్‌ఆర్సీపీ ఏడు స్థానాలు దక్కించుకుంది. టీడీపీ ఆరు, జనసేన ఒకటి గెలుచుకున్నాయి. దాంతో ఎంపీటీసీ స్థానాలు సమానం కావడంతో ఎంపీపీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈనెల 19న జరిగే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యుడు ఎన్నిక వ్యవహారంలో ఏం జరగబోతోంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ పేర్లతో ఎంపీపీ పదవికి లాటరీ ద్వారా ఎంపిక చేస్తారని అధికారులు తెలిపారు. దాంతో ఎంపీటీసీల్లో ఉత్కంఠ నెలకొంది.

19న ఎంపీపీ,

20న జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక

అదే రోజు ప్రత్యేక సమావేశాలు

వైఎస్‌ఆర్‌ సీపీకి నాలుగు ఎంపీపీలు

రామసముద్రం ఎంపీపీకి లాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement