● పదో తరగతి పరీక్షల తొలి అంకం
● నేటి నుంచే ఫీజుల చెల్లింపు ప్రక్రియ
● అపరాధ రుసుము లేకుండా
ఈనెల 25 వరకు గడువు
● జిల్లాలో 22,129 మంది విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 239 ఉన్నత పాఠశాలలు ఉండగా, వాటిలో 22,129 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ ఏడాది టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షలలో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ ప్రత్యేకంగా ‘మిషన్ మార్చి–2027’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. హెచ్‌ఎంలు ఈనెల 25లోగా నామినల్ రోల్స్ ప్రక్రియను పూర్తి చేసి, పాఠశాల లాగిన్లోని లింక్ ద్వారా ఫీజు చెల్లించాలి – సుబ్రమణ్యం (డీఈఓ)
మదనపల్లె సిటీ: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ ప్రక్రియలో తొలి అంకానికి పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. 2027 మార్చిలో జరగబోయే పదో తరగతి పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం పూర్తి షెడ్యూలును విడుదల చేసింది. ఈనెల 25 లోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న రెగ్యులర్ విద్యార్థులతో పాటు, గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు
పరీక్ష ఫీజును విద్యార్థులు నేరుగా కాకుండా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుందని డీఈఓ సుబ్రమణ్యం స్పష్టం చేశారు. దీని కోసం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, ఆధార్ కార్డ్, యూడైస్ డేటా, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన అపార్ ఐడీ తదితర రికార్డులను క్షుణ్ణంగా సరిచూసుకున్న తర్వాతే హెచ్‌ఎంలు ఫీజు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
సబ్జెక్టులవారీగా పరీక్ష ఫీజు వివరాలు
రెగ్యులర్ విద్యార్థులు: అన్ని సబ్జెక్టులకు కలిపి పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లించాలి.
ఫెయిలైన (సప్లిమెంటరీ)విద్యార్థులు:
● మూడు లేదా అంతకంటే తక్కువ సబ్జెక్టులు ఉన్నవారు: రూ.110
● మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్నవారు: రూ.125
● వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు: సాధారణ ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫీజుకు అదనంగా మరో రూ.60 కట్టాలి.
● తక్కువ వయస్సు గల విద్యార్థులు: ప్రత్యేక ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.
● ప్రత్యేక అవసరాలు గల పిల్లలు: వీరికి పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. ‘సదరం’ సర్టిఫికెట్ లేని వారు, సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ద్వారా సివిల్ సర్జన్ ధ్రువీకరించిన పత్రాన్ని సబ్మిట్ చేయవచ్చు.
అపరాధ రుసుము వివరాలు
ఈనెల 25 తర్వాత ఫీజు చెల్లించే విద్యార్థులు రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 26 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు..ౖ రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు, ౖ రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 15 వరకు చెల్లించవచ్చు.


