నేడు పరిషత్‌ ఎన్నికల ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

నేడు పరిషత్‌ ఎన్నికల ఫలితాలు

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

సాక్షి, మదనపల్లె : జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల లెక్కింపు శనివారం జరుగనుంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జిల్లాలోని డివిజన్‌ కేంద్రాలైన మదనపల్లె, పీలేరు, రాయచోటిలో చేపడుతున్నారు. దీనికోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై చివరి ఓటు లెక్కింపు దాకా ఎంత సమయం పడితే అప్పటిదాకా ఈ ప్రక్రియ కొనసాగిస్తారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ తో..

జిల్లాలో 22 జెడ్పీటీసీ, 152 ఎంపీపీటీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి లెక్కింపు కేంద్రానికి తీసుకొస్తారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఎంపీటీసీ ఓట్లను వేరుగా, మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్లు మొత్తాన్ని కలిపి ఒకేసారి లెక్కింపు మొదలుపెడతారు. దీనికి సమానంగా ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీనికోసం ఒక్కో మండలానికి ఆరు నుంచి 12 టేబుల్‌ లను ఓట్ల లెక్కింపునకు సిద్ధం చేశారు.

● జిల్లాలో అత్యధికంగా మదనపల్లె మండలానికి 12 టేబుల్‌లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మూడు డివిజన్‌ కేంద్రంలో 168 టేబుళ్లను ప్రస్తుతానికి ఏర్పాటు చేశారు. లెక్కింపు సమయానికి అవసరమైతే వీటి సంఖ్యను పెంచుకుంటారు. మదనపల్లి డివిజన్‌ కు సంబంధించి ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో, పీలేరులో ఎస్‌ జి డిగ్రీ కళాశాలలో, రాయచోటిలో పాత ఎస్పీ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీనికోసం భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.

లెక్క తేలనుంది..

జిల్లాలో 22 జెడ్పీటీసీ స్థానాలకు 91 మంది అభ్యర్థులు, 152 ఎంపీటీసీ స్థానాలకు 392 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 493 మంది అభ్యర్థులు శనివారం ఓట్ల లెక్కింపులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఎన్నికల్లో తమకు ఎన్ని ఓట్లు వస్తాయి అన్న లెక్కలు వేసుకున్నారు. ఈ లెక్కల మేరకు ఓట్ల లెక్కింపులో ఓడతారో, గెలుస్తారో తేలిపోతుంది.

ఏకగ్రీవాలు వారివే ..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో, ఆ తర్వాత ఉపసంహరణతో ఏకగ్రీవమైన స్థానాలు టీడీపీవే ఉన్నాయి. బెదిరింపులు, వేధింపుల ఫలితంగా రామాపురం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి జడ్పిటిసిలు టిడిపి ఖాతాలో పడ్డాయి. ఏకగ్రీవమైన 169 ఎంపీటీసీ స్థానాల్లోనూ అధికార టీడీపీదే పైచేయి. ఏకగ్రీవంలో బలవంతంగా నామినేషన్ల సాధించుకున్నవే.

● శుక్రవారం జరిగిన ఎన్నికల్లో పుంగనూరు, పీలేరు, రాయచోటి నియోజకవర్గంలో కనీసం ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లో రానివ్వకుండా, వచ్చినా వారిని బయటకు పంపేసి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకున్నారు. దీని ఫలితంగా జిల్లాలో స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జెడ్పీ పీఠానికి 13 కావాలి..

జిల్లాలో తొలి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకోవాలంటే 13 జెడ్పీటీసీల బలం అవసరం. జిల్లాలోమొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో అధికార టీడీపీ మూడు జెడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 22 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, టీడీపీ అధికార బలంలో పలుచోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లో లేకుండా చేసి ఏకపక్షంగా ఓటింగ్‌ చేయించుకున్నారు. అడ్టొచ్చిన ఏజెంట్లను బయటకు పంపేశారు. ఇలాంటి అరాచక పరిస్థితుల్లో మెజార్టీ స్థానాలను ఎవరు సాధిస్తారు, జెడ్పీ పీఠం ఎవరు దక్కించుకుంటారో వేచిచూడాలి.

కౌంటింగ్‌ కేంద్రాలు

మదనపల్లె కేంద్రం : మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం, తంబళ్లపల్లి, పెద్దమండెం, ములకలచెరువు, పిటిఎం, బి.కొత్తకోట, కురబలకోట, పుంగనూరు, చౌడేపల్లి మండలాలు. ఎన్నికల సిబ్బంది–299 మంది, కౌంటింగ్‌ హాల్స్‌–11.

రాయచోటి కేంద్రం : చిన్నమండెం, గాలివీడు, సంబేపల్లి మండలాలు., ఎన్నికల సిబ్బంది–217 మంది, కౌంటింగ్‌ హాల్స్‌–03.

పీలేరు కేంద్రం : కలకడ, కలికిరి, కెవి.పల్లి, సదుం, సోమల, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలు. ఎన్నికల సిబ్బంది–123 మంది, కౌంటింగ్‌ హాల్స్‌–8. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ ఒకరు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు ఇద్దరు, ఒక వీడియో గ్రాఫర్‌ ఉంటారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో

493 మంది పోటీ

తొలి జడ్పీపీఠం ఎవరికి దక్కేనో..!

మూడు కేంద్రాల్లో నేడు ఓట్ల లెక్కింపు

168 టేబుళ్లు ఏర్పాటు

కౌంటింగ్‌కు మూడంచెల భద్రత

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లాలో శనివారం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. శుక్రవారం ఎస్పీ మదనపల్లెలో మాట్లాడుతూ... రాయచోటిలోని పాత ఎస్పీ కార్యాలయ భవనాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం, పీలేరు, మదనపల్లె లలోని కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన అనంతరం అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రితో కలసి మాట్లాడుతూ.. కౌంటింగ్‌ రోజున విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. అభ్యర్థులు, ప్రజలు సంయమనం పాటిస్తూ లెక్కింపు ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాయకులు గానీ ప్రజలు గానీ వ్యవహరిస్తే వారిపైన కఠినమైన చర్యలు కేసులు తప్పవని హెచ్చరించారు.

రాయచోటి : కౌంటింగ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. రాయచోటిలోని కౌంటింగ్‌ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, టౌన్‌ సీఐ చలపతి, ఎస్‌బి సీఐ సదా శివయ్య, ఎస్‌ఐ విష్ణులతో ఆయన భద్రతా సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు చేశారు.

కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

పీలేరు రూరల్‌ : స్థానిక సంజయ్‌గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఽధీరజ్‌ కనుబిల్లి పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీలేరు డివిజన్‌ పరిధిలోని పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, గుర్రంకొండ, కలకడ, కేవి.పల్లె, సదుం, సోమల మండలాలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌, వాహనాల పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌, ఆర్‌డీఓ విజయలక్షీ, ఆర్‌ఓ శ్రీనివాసులు నాయుడు, తహశీల్దారు శివకుమార్‌, ఎంపీడీఓ శివశంకర్‌, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement