●జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి ఎవరు ? | - | Sakshi
Sakshi News home page

●జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి ఎవరు ?

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

●జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి ఎవరు ?

సాక్షి, మదనపల్లె: జిల్లా, మండల ప్రజా పరిషత్‌ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు పీటముడి వేశాయి. సోమవారం మదనపల్లెలో టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌చార్జ్‌ శంకర్‌ యాదవ్‌ కార్యాలయం వేదికగా జిల్లా ఇంచార్జ్‌ మంత్రి బీసీ.జనార్దన్‌ రెడ్డి, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌, జనసేన, బీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎవరికి ఏ జెడ్పీటీసీ ఇవ్వాలి, ఏ మండలంలో ఎన్ని ఎంపీటీసీలు ఇవ్వాలి అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించినప్పటికీ కొలిక్కి రాకపోవడంతో పార్టీల్లో అసహనం వ్యక్తమవుతోంది.

● ప్రధానంగా జిల్లాలో జనసేన, బీజేపీకి ఉన్న వర్గాల వారి ఓటు శాతం, ఏఏ ప్రాంతంలో బలముందో అక్కడ తమకు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ వారి నుంచి వచ్చింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ఉండగా సోమవారం రాత్రి వరకు ఈ సీట్ల పంచాయతీ, సర్దుబాటులో కొలిక్కి రాకపోవడంతో టీడీపీ తమను నమ్మించి మోసం చేస్తుందా, అడిగిన సీట్లు ఇస్తుందా అన్నదానిపై జనసేన, బీజేపీలో అంతర్మధనంలో పడ్డాయి.

పట్టుబడుతున్న జనసేన..

జిల్లాలో జనసేనకు సీట్ల కేటాయింపు విషయంలో మంత్రులతో ఆ పార్టీ ప్రతినిధులు రామదాస్‌ చౌదరి, దారం అనిత పట్టుబట్టినట్లు తెలిసింది. జిల్లాలో మదనపల్లె, బి.కొత్తకోట, రాజంపేట జెడ్పీటీసీలు, మదనపల్లె నియోజకవర్గంలో 30, తంబళ్లపల్లెలో 24, పుంగనూరులో 18, పీలేరులో 18 ఎంపీటీసీ స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన మంత్రులు వద్ద ఉంచారని తెలిసింది. అయితే ఈ సీట్ల ప్రతిపాదనకు మంత్రులు సానుకూలంగా స్పందించలేదని, ప్రతిపాదిత సీట్లలో కోత విధించవచ్చునని అనుమానిస్తున్నారు. అయితే జనసేనకు జిల్లాలో ఉన్న బలాన్ని దృష్టిలో పెట్టుకొని కోరిన సీట్లు ఇవ్వాల్సిందేనని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో పాటు పట్టుబట్టే అవకాశం ఉంది.

మభ్య పెట్టేందుకేనా ఐవీఆర్‌ఆస్‌..

జనసేన కోరిన సీట్ల విషయంలో మంత్రులు తేల్చి చెప్పనప్పటికీ మంగళవారం ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా సీట్లను కేటాయిద్దామన్న అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై జనసేన నేతలు అసహనం వ్యక్తం చేయడంతో పాటు, మంగళవారం ఒక రోజే ఉపసంహరణలు ఉన్నాయి, అది కూడా సాయంత్రం మూడు లోపల ముగిసిపోవాలి. అయితే టీడీపీ తమను మభ్యపెట్టి సీట్ల సర్దుబాటులో మోసం చేస్తుందా అన్న అనుమానాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

బీజీపీకి మొక్కుబడే..

బీజేపీకి కార్యకర్తలు లేని సమయంలో రాయలసీమలో అన్నమయ్య జిల్లాలో బలమైన నాయకత్వం, క్యాడర్‌ ఉండేది. ఇప్పుడు పొత్తు కారణంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీకి నామమాత్రం కేటాయించే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రులతో జరిగిన చర్చల్లో బీజేపీ ప్రతినిధులు చల్లపల్లి నరసింహారెడ్డి, పులి నరేంద్ర కుమార్‌ రెడ్డి, ఆకుల కృష్ణమూర్తి, ఎం.గోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ చర్చల్లో జిల్లాలో 321 ఎంపీటీసీలగాను బీజేపీకి కేవలం 15 స్థానాలు, 25 జెడ్పీటీసీల్లో కేవలం ఒక్క జెడ్పీటీసీ (ములకలచెరువు) ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఇది సరిపోదని మదనపల్లె మండల జెడ్పీటీసీ కూడా కావాలని పట్టుబడుతున్నారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో 3, రాయచోటి నియోజకవర్గంలో 2, మదనపల్లి నియోజకవర్గంలో 3, తంబళ్లపల్లి నియోజకవర్గంలో 6 ఎంపీటీసీ స్థానాలకే బీజేపీని పరిమితం చేసేలా సీట్ల కేటాయింపు జరిగిందని తెలుస్తోంది.

మున్సిపల్‌ వార్డులపై ప్రతిష్టంభన..

జనసేన, టీడీపీ మధ్య మదనపల్లె మున్సిపాలిటీలో నాలుగు వార్డుల ఎన్నిక విషయంలో తీవ్రమైన విభేదాలు బహిర్గతం అయ్యాయి. మంత్రులతో జరిగిన చర్చలలో జనసేన ప్రతినిధులు రాందాస్‌ చౌదరి, దారం అనితలు జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 1, 2, 34, 43 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టిందని, ఎన్నికల బరి నుంచి వారిని తప్పించాలని పట్టుబట్టారు. ఒప్పందం ప్రకారం టీడీపీ వ్యవహరించడం లేదని, ఈ విషయంలో జనసేనకు న్యాయం చేయాలని మంత్రులను కోరారు. అయితే ఈ అంశంపై మంత్రులు చర్చించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ఈ విషయాన్ని పరిశీలిద్దాం అంటూ దాటవేసినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే జనసేనకు న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదని ఆ వర్గీయులు పేర్కొంటున్నారు.

జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు రగులుతోంది. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో జెడ్పీ అభ్యర్థి ఎవరు అన్నది ఉత్కంఠతో పాటు, ఏ వర్గానికి చంద్రబాబు పెద్దపీట వేస్తారన్నది జిల్లా పార్టీలో చర్చ జరుగుతోంది. దీనికి ప్రధానంగా కీలక నేతలైన.. రాజంపేట జిల్లా అధ్యక్షులు ప్రసాద్‌ సుగవాసి, మాజీ ఎమ్మెల్యే జి.ద్వారకనాథ్‌ రెడ్డి గాలివీడు జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్‌ రెడ్డి సొంత మండలం చిన్నమండెం జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ముగ్గురు జిల్లా రాజకీయాల్లో కీలకమైన నేతలు కావడంతో చంద్రబాబు ఎవరి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతారు అన్నది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నామినేషన్లను మంగళవారం ఉపసంహరించాల్సి ఉన్నందున.. ఈ ముగ్గురిలో ఎవరు పోటీలో ఉంటారు, ఎవరు వైదొలుగుతారు అన్నది సాయంత్రం మూడు గంటల దాకా ఈ సస్పెన్‌న్‌ కొనసాగేలా కనిపిస్తోంది. మంత్రి మండిపల్లి, సుగవాసిలు ప్రత్యర్థులుగా జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చైర్మన్‌ పదవి కోసం రెండు వర్గాలు పట్టుబట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి ఎవరో

తేల్చని చంద్రబాబు

జిల్లాలో జనసేనకు మూడు,

బీజేపీకి ఒక జెడ్పీటీసీ

జనసేనకు 90, బీజేపీకి 15 ఎంపీటీసీలు

ఆ నాలుగు వార్డులపై పట్టుబట్టిన జనసేన

రేపటికి చూద్దామంటూ దాటవేత

మంత్రులతో కొలిక్కిరాని కూటమి చర్చలు

ఐవీఆర్‌ఎస్‌ సర్వే అంటూ దోబూచులాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement