● పార్టీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్బోధ
● వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న
ప్రభుత్వ తీరుపై మండిపాటు
● తొలిరోజు పర్యటనలో జనంతో మమేకం
● నేడు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి
పులివెందుల : కూటమి సర్కార్ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తోందని.. అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధించడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ధైర్యంగా ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రోజులు ఎప్పుడూ ఇలానే ఉండవని.. మనకు మంచి రోజులు రానున్నాయని ధైర్యమిచ్చారు. మీ కాలర్ ఎగరేసే పరిస్థితి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం పులివెందులలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలను పేరు పేరునా ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ సమస్యలను సావధానంగా ఆలకించారు. ఈ సందర్భంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని పలువురు కార్యకర్తలు వాపోయారు. అందుకు స్పందించిన వైఎస్ జగన్ ఈ ప్రభుత్వం పోలీసు వ్యవస్థనే కాక అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోందన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి కానీ, కీడు చేయకూడదన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం,పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేశామని పేర్కొన్నారు. కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు.
ప్రజాదర్బార్‌కు విశేష స్పందన
మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్‌కు పెద్ద ఎత్తున ప్రజలు, యువత, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. తమ సమస్యలను నేరుగా వివరించి వినతిపత్రాలు అందజేశారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని, కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు నిలిచిపోయాయని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్న మాజీ సీఎం వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. పేదలు, విద్యార్థులు, వృద్ధులు, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాల్సిందేనని అన్నారు. తమ ప్రభుత్వం వస్తూనే అందరికీ న్యాయం జరుగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.
దివ్యాంగుడితో ఆప్యాయంగా..
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం మదనపల్లెకు చెందిన రెండు కాళ్లు లేని దివ్యాంగుడు నందు కలిశాడు. ఈ సందర్భంగా తన కోసం అంత దూరం నుంచి వచ్చిన నందును వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నందు జననేతతో ఫొటో తీసుకుని ఆనందం వ్యక్తం చేశాడు.
వైఎస్ జగన్‌కు రాఖీలు కట్టిన అక్కాచెల్లెమ్మలు
మంగళవారం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌లో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర, జిల్లా నలుమూలల నుంచి పలువురు అక్కాచెల్లెమ్మలు కలిశారు. ఈ సందర్భంగా వారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీలు కట్టారు. మహిళలందరిని ఆప్యాయంగా పలకరించిన జగన్ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
వైఎస్ జగన్‌ను కలిసిన నేతలు
భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు నేతలు కలిశారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌బీ అంజద్ బాషా, అత్తార్ చాంద్ బాషా, కొరముట్ల శ్రీనివాసులు, కడప మాజీ మేయర్ సురేష్‌బాబు, కమలాపురం ఇన్‌ఛార్జి నరేన్ రామాంజుల్‌రెడ్డి, బద్వేలు వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి వైఎస్ మనోహర్‌రెడ్డి, చవ్వా దుశ్యంత్‌రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాదరెడ్డి తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.
జగనన్నకు రాఖీ కడుతున్న అక్కచెల్లెమ్మలు
దివ్యాంగుడి బాధను వింటున్న మాజీ సీఎం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్దంతి సందర్భంగా బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఉదయం 7.30గంటలకు పులివెందుల నుంచి రోడ్డు మార్గాన వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించనున్నారు.


