సాక్షి రాయచోటి : చెరగని చిరునవ్వు...తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు... నడకలో రాజసం...నమ్ముకున్న వారిని ఆదరించే గుణం...మాట తప్పని మడమ తిప్పని నైజం...కార్మికులు, కర్షకుల కోసం పరితపించే గుణం... ఈ లక్షణాలన్నీ కలగలిపిన ఏకై క నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన చేసిన అభివృద్ధితో తెలుగు నేల పులకించిపోయింది. ప్రతి ఇంటా సంక్షేమం వెల్లివిరిసింది.
వైఎస్సార్ హయాంలో మారిన జిల్లా స్వరూపం
డాక్టర్ వైఎస్సార్ రాకతో రాయచోటి రూపురేఖలు మారాయి. కలలో కూడా నిర్మించలేమనుకున్న ఎన్నో పనులు పూర్తయ్యాయి. రహదారుల నిర్మాణం, విద్యాభివృద్ధికి కళాశాలలు మంజూరు, సాగునీటి ప్రాజెక్టులు, పక్కాగృహాలు ఇలా చెబుతూపోతే ప్రతి విభాగంలోనూ వైఎస్సార్ ముద్ర కనిపిస్తుంది. నాటి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనేక రంగాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేశారు. రాయచోటి, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని పీలేరులో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, జిల్లాలో లక్షకుపైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పేరెన్నికగన్న విద్యా సంస్థల ఏర్పాటు, వేలాదిమందికి రేషన్‌కార్డులతోపాటు పింఛన్లతో జిల్లాపై డాక్టర్ వైఎస్సార్ చెరగని ముద్ర వేశారు.
జలయజ్ఞంలో పూర్తయిన
తొలి ప్రాజెక్టుగా వెలిగల్లు
వైఎస్సార్ హయంలో చేపట్టిన జలయజ్ఞంలో పూర్తయిన తొలి ప్రాజెక్టుగా వెలిగల్లు నిలిచింది. ముఖ్యమంత్రి హోదాలో 2008 డిసెంబరు 24వ తేదిన జాతికి అంకితం చేశారు. 4.64 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు కోసం రూ. 300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు లక్ష్యం. ఇక బ్రిటీష్ కాలం నుంచి ప్రచారంలో ఉన్న ఝరికోన ప్రాజెక్టుకు వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే రూపకల్పన దాల్చుకుంది. చిత్తూరు జిలా సరిహద్దు ప్రాంతంలోని ఝరికోన వద్ద ఈ ప్రాజెక్టును 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ ప్రాజె క్టు ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. అలాగే పీలేరు నియోజకవర్గంలోని అడవిపల్లె రిజర్వాయర్‌ను 2.50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. 5 మండలాలకు తాగు, సాగునీరే ధ్యేయంగా శ్రీనివాసపురం(నాగిరెడ్డి) రిజర్వాయర్ హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగంగా 308 కోట్ల రూపాయలతో 1.25 టిఎంసీల సామర్థ్యంతో చిన్నమండెం మండల కేంద్రం సమీపంలో నిర్మించారు. పీలేరు నియోజకవర్గం కేవీ పల్లె పరిధిలోని రెండు ప్రాజెక్టులు పూర్తి చేశారు.
విద్యాపరంగా ఎంతో అభివృద్ధి
రాయచోటిలో వైఎస్సార్ పాలన చేపట్టిన తర్వాత రూ. 150 కోట్ల రూపాయలతో రాయచోటిలో 5 మోడల్ పాఠశాలలను మంజూరు చేయడంతో పాటు వాటికి భవనాలను నిర్మించారు. రైల్వేకోడూరుకు సంబంధించి ప్రత్యేకంగా వైఎస్సార్ ఉద్యాన కళాశాల, ఓబులవారిపల్లెలో పాలిటెక్నిక్ కళాశాలను అందించారు. వైఎస్‌ఆర్ హయాంలోనే కోర్టు భవనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లాలో ఎన్నో బాలుర, బాలికల విద్యాలయాలు, కేజీబీవీలు నెలకొల్పి విద్యకు పెద్దపీట వేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వేల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతోపాటు రుణమాఫీ పేరుతో రూ. 200 కోట్లకు పైగా అందించి రైతులను రుణ విముక్తులను చేశారు.
సొంత భూమిని దానం చేసి...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన సొంత భూమిని కూడా పేద ప్రజలకు పంచి పెట్టి వారి గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. అప్పటి ఉమ్మడి కడపజిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరులో 2007లో తన సొంత భూమి 304 ఎకరాలను 108 మంది ఎస్టీ కుటుంబాలకు అప్పటి ఎమ్మెల్యే ప్రభావతమ్మతో కలిసి స్వయంగా పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ భూముల్లో గిరిజనులు పంటలు పండించుకుంటూ...మామిడి పంటతో జీవనాధారం పొందుతున్నారు. వ్యవసాయ పరంగా రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకాలతో రైతుల్లో చెరగని ముద్ర వేసిన ఆరోగ్యశ్రీ, 108 పథకాల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
హంద్రీ–నీవాకు జీవంపోసిన వైఎస్‌ఆర్
2004లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవాప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. ఆయనవల్లే ఈ ప్రాజెక్టు మోక్షం కలిగి, ఏకకాలంలో ప్రాజెక్టు పనులు మొదలై ఉరకలెత్తాయి. వైఎస్ హయాంలో మొత్తం రూ.3,388.5కోట్ల బడ్జెట్‌ను కేటా యిస్తే రూ.4,295.1కోట్ల పనులు జరిగాయి. అంటే రూ.6,848 కోట్ల ప్రాజెక్టు విలువలో మిగిలిన పనులు రూ.2,552.9 కోట్లే. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక పనులను రద్దు చేయడం, మిగులు పనులను అంచనాలను పెంచుకుని దోచుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొలువుదీరాక కృష్ణా జలాలను చిత్తూరు జిల్లాకు తరలించారు. అంతేగాక కుప్పానికి కృష్ణా జలాలను అందించిన ఘనత వైఎస్.జగన్‌దే.
నీ రూపం వచ్చిపోయే ‘అల’కాదు.. తుడిచిపెట్టుకుపోవడానికి..
కళ్లు తెరిస్తే చెదిరిపోయే ‘కల’ కాదు మరచిపోవడానికి..
మా గుండె గుడిలో నీ రూపం శాశ్వతం...
నీ నవ్వు.. జ్ఞాపకాలు నిత్యం పదిలం


